మార్చిలో వస్తున్న మోస్ట్ ఎవేటెడ్ ఫిల్మ్… ఊపిరి. నాగార్జున, కార్తీలు కలసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్… తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మితమైంది. పాటలు, ప్రచార చిత్రాలూ ఈసినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. దానికి తోడు ఓ హాలీవుడ్ సినిమాకి అఫీషియల్ రీమేక్. ఇప్పటి వరకూ యాక్షన్ చిత్రాల్ని రూపొందించిన వంశీ పైడిపల్లి దర్శకుడు కావడంతో.. ఊపిరిపై అందరి దృష్టీ పడింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? అన్న విషయం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
ఊపిరి కోసం ఏకంగా రూ.60 కోట్లు పెట్టామని ఇటీవల నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి కూడా కుండ బద్దలు కొట్టారు. దాంతో చిత్రసీమ షాక్ తిన్నది. నాగ్ సినిమాకి రూ.25 కోట్లంటేనే హై బడ్జెట్ మూవీ. అలాంటిది రూ.60 కోట్లు పెట్టామనడం నమ్మశక్యం కావడం లేదు. మరో కథానాయకుడిగా కార్తి నటించడం, ఈ సినిమాకి తమిళంలోనూ మార్కెట్ ఉండడంతో… పీవీపీ అంత రిస్క్ చేసిందేమో?! దానికి తోడు ఈ సినిమాకి పారిస్‌లో తెరకెక్కించారు. అక్కడ షూటింగ్ అంటే.. ఖరీదైన వ్యవహారమే. సినిమా అంతా రిచ్‌గా రావడానికి పీవీపీ కోట్లు ధారబోసింది. దానికి తోడు రీమేక్ రైట్స్ కోసం కూడా భారీ మొత్తం వెచ్చించాల్సివచ్చింది. రూ.60 కోట్లు రాబట్టడం పీవీపీకి ఛాలెంజింగ్ వ్యవహారమే. తెలుగు, తమిళ రైట్స్ ద్వారా కనీసం రూ.15 కోట్లు రాబట్టొచ్చు. ఇక బాక్సాఫీసు దగ్గర ఊపిరి ఏమేరకు నిలబడుతుంది? అనే విషయంపైనే పీవీపీ భవితవ్యం ఆధారపడి ఉంది.