Ooru Peru Bhairavakona Movie review
తెలుగు360 రేటింగ్: 2.5/5
-అన్వర్
తెలుగులో వచ్చినన్ని ఫాంటసీ కథలు మరే చిత్రసీమలోనూ రాలేదేమో..? స్టార్స్ దగ్గర్నుంచి కొత్త హీరోల వరకూ అందరూ ఈ జోనర్ టచ్ చేయడానికి ఇష్టపడతారు. వాటికి ఆదరణ కూడా ఎక్కువే. విజువలైజేషన్ మీద పట్టుంటే, ఫాంటసీ కథలతో అద్భుతాలు సృష్టించొచ్చు. ఈమధ్య విడుదలైన ‘హనుమాన్’లో ఆ మ్యాజిక్ కనిపించింది. ఇప్పుడొచ్చిన ‘ఊరు పేరు భైరవకోన’ కూడా అలాంటి ప్రయత్నమే. ‘హనుమాన్`లో దైవం కనిపిస్తే… ‘భైరవకోన’లో ఆత్మలు సంచరించాయి. అంతే తేడా! మరి ఆ ప్రయత్నం ఎలా ఉంది? వి.ఐ.ఆనంద్ సృష్టించిన ఫాంటసీ వరల్డ్ మెప్పించేలా ఉందా? సందీప్ కిషన్ కష్టం ఫలించిందా?
బసవ (సందీప్ కిషన్) ఓ పెళ్లింట నగల్ని ఎత్తుకెళ్లిపోతాడు. వెనుక పోలీసులు పడతారు. స్నేహితుడి (వైవా హర్ష)తో కలిసి.. తప్పించుకొంటూ భైరవకోన అనే ఓ ఊర్లో అడుగుపెడతాడు. ఆ ఊరే వింతగా ఉంటుంది. అక్కడ అడుగు పెట్టడమే కానీ, వెనక్కి వెళ్లడం జరగదు. జనం కూడా వింతగా ప్రవర్తిస్తుంటారు. బసవ కాజేసిన నగల్ని సైతం.. ఎవరో ఎత్తుకుపోతారు. ఆ నగలు పట్టుకెళ్లడం బసవకు అత్యవసరం. అందుకే ప్రాణాలపైకొచ్చినా ఆ ఊర్లోనే ఉండాల్సివస్తుంది. ఇంతకీ భైరవకోన వెనుక ఉన్న రహస్యాలేంటి? బసవ దొంగతనం ఎందుకు చేయాల్సివచ్చింది. తన కథలో భూమి (వర్ష బొల్లమ్మ) పాత్రేమిటి? గరుడ పురాణంలో మాయమైన నాలుగు పేజీలకూ, భైరవకోనకూ ఉన్న లింకేమిటి? అనేది అసలు కథ.
ఈ కథలో ‘భైరవకోన’ అనేది సెంట్రల్ పాయింట్. కథగా చెప్పుకోవడానికి ఏం ఉండదు. ఎందుకంటే ఏం చెప్పినా, కథలో ఆసక్తికరమైన పాయింట్ రివీల్ అయిపోతుంది. కాబట్టి.. వాటి జోలికి వెళ్లడం లేదు. ‘భైరవకోన’ అనే ఓ ఊరిని చూపిస్తూ కథ మొదలెట్టిన దర్శకుడు అక్కడ ఏదో జరుగుతోందన్న ఆసక్తిని కలిగించాడు. బసవ దొంగతనం చేయడం, అనుకోకుండా ఆ ఊర్లోకి వెళ్లడం, అక్కడి మనుషుల ప్రవర్తన చూసి షాకవ్వడం.. ఇలా సన్నివేశాలు చక చక నడుస్తుంటాయి. సగటు ప్రేక్షకుడి అక్కడ ఏం జరుగుతోందన్న ఆసక్తి మొదలవుతుంది. ఇంట్రవెల్ లో ఓ షాకింగ్ ఎలిమెంట్ వస్తుంది. ఆ సన్నివేశాల్లో వచ్చే విజువల్ ఎఫెక్ట్స్ మరీ అబ్బురపరచకపోయినా… థ్రిల్ కలిగిస్తాయి. మధ్యలో నారప్పగా వెన్నెల కిషోర్ చేసిన కామెడీ, ఆ పాత్ర కోసం రాసుకొన్న డైలాగులూ నవ్విస్తాయి. ఈ సినిమా మొత్తంలో టైమ్ పాస్ ఎలిమెంట్ ఆ పాత్ర మాత్రమే.
ఫస్టాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ అలా వస్తూ, పోతూ ఉంటుంది. దాన్ని బట్టి.. హీరో జీవితంలో అనుకోని ఘటన ఏదో జరిగిందన్న హింట్ ప్రేక్షకులకు అందుతుంటుంది. భూమి పాత్ర చుట్టూ ఏదో విషాదం ఉందని తెలుస్తుంటుంది. ఎమోషన్‌గా కనెక్ట్ అయ్యే పాయింట్లని వీలైనంత త్వరగా రివీల్ చేస్తేనే నయం. లేదంటే రాను రానూ ఆ ఎమోషన్ పై ఆసక్తి సన్నగిల్లుతుంది. భైరవ కోనలో అదే జరిగింది. హీరో- హీరోయిన్ల మధ్య ఏం జరిగిందన్నది రివీల్ చేయడానికి చాలా సమయం తీసుకొన్నాడు దర్శకుడు. ఓ ఆసక్తికరమైన పాయింట్ దగ్గర ఇంట్రవెల్ కార్డు వేసినప్పటికీ… అదే ఆసక్తిని ద్వితీయార్థంలో కొనసాగించడంలో విఫలం అయ్యాడు.
హీరో ఆత్మల్ని మోసం చేయడం, హీరో నాటకాన్ని ఆత్మలు పసిగట్టకపోవడం అంత అతికినట్టు అనిపించలేదు. భైరవకోన చుట్టూ ఉన్న రహస్యాన్ని, గరుగపురాణంలో మాయమైన 4 పేజీల కథని వాయిస్ ఓవర్లా చెప్పడంతో ప్రేక్షకులకు అంతగా రిజిస్టర్ అవ్వదు. నిజానికి సెకండాఫ్‌లో మరిన్ని మలుపులు ప్రేక్షకుడు ఆశిస్తాడు. అలాంటి ట్విస్టులు దర్శకుడు అట్టిపెట్టుకొన్నా, ఇంట్రవెల్ కి ఇచ్చిన బిల్డప్ ముందు అవి సరిపోలేదు. లవ్ స్టోరీని ఇంకాస్త ఎఫెక్టీవ్ గా రాసుకోవాల్సింది. హీరోయిన్ వెనుక ఉన్న కథని హృదయాన్ని కదిలించేలా చెప్పాల్సింది. ఈ రెండూ జరిగితే.. `భైరవకోన` మరింత రక్తికట్టేది.
ఫాంటసీ కథల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే… ప్రేక్షకులు లాజిక్ అడగరు. అక్కడ మ్యాజిక్ కుదిరితే సరిపోతుంది. దర్శకుడు ఏదైనా విజువలైజేషన్ చేసుకోవొచ్చు. చూపించే నేర్పు ఉండాలంతే. వి.ఐ ఆనంద్ విజువలైజేషన్ బాగుంది. కాకపోతే.. ఇలాంటి కథలు చేసినప్పుడు విజువల్ ఇంపాక్ట్ ఇవ్వడానికి మరింత కసరత్తు చేయాల్సింది.
సందీప్ కిషన్ ఎప్పుడూ కొత్తతరహా కథల వెంట పడుతుంటాడు. ఈ జోనర్ తనకు పూర్తిగా కొత్త. నటుడిగా ఓ కొత్త సందీప్‌ని చూసే అవకాశం రానప్పటికీ, ఆ పాత్ర వరకూ ఏం కావాలో, ఏం చేయాలో అదంతా చేశాడు. భూమి పాత్రలో వర్ష ఒదిగిపోయింది. కావ్య ధాపర్ పాత్ర సరిగా అతకలేదు. సెకండాఫ్‌లో ఆ పాత్రతో ఓ ‘నాటకం’ ఆడించినా సరిపోలేదు. ఈ సినిమాలో కావ్యని ఉద్దేశించి వెన్నెల కిషోర్ ఓ మాట అంటాడు ‘నట శూన్య’ అని. అది ఆమె నటనకు సరిగ్గా సరిపోతుంది. వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో సినిమాని లాక్కొచ్చాడు. రవిశంకర్ పాత్రని ఇంకాస్త బాగా రాసుకోవాల్సింది. వైవా హర్ష ఓకే అనిపిస్తాడు. బ్రహ్మాజీ పాత్ర చిన్నదే అయినా, స్పెల్లింగ్ మిస్టేక్స్తో తన పాత్రని డిజైన్ చేసిన విధానం బాగుంది.
టెక్నికల్‌గా ఈ సినిమా మెప్పిస్తుంది. క్వాలిటీ విషయంలో నిర్మాత రాజీ పడలేదు. భైరవకోన అనే సెటప్‌ని డిజైన్ చేసిన విధానం ఆకట్టుకొంటుంది. ‘నిజమే చెబుతున్నా..’ పాట ఆడియోపరంగా పెద్ద హిట్. అయితే.. ఆ పాటకు తగిన సందర్భం కుదర్లేదనిపిస్తుంది. నేపథ్య సంగీతం విషయంలోనూ శేఖర్ చంద్ర పనితనం మెప్పిస్తుంది. కొన్ని మాటలు భలే పండాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్ నుంచి వచ్చినవి. ‘కోల్డ్ బ్లడెడ్ మర్డర్’ని కాస్త మార్చి సందర్భానుసారంగా ‘కోడి’ బ్లడెడ్ మర్డర్ అనడం బాగుంది. అమ్మాయిలపై ద్వేషం పెంచుకొన్న పాత్ర అది. అందుకే ‘నేను పాలు తాగి పెరగలేదు. చాయ్ తాగి పెరిగా’ అంటాడు. ఇలాంటి ఛమక్కులు అక్కడక్కడ తగిలాయి. వి.ఐ.ఆనంద్ ఓ ఫాంటసీ వరల్డ్ సృష్టించాడు. కథలో ఆసక్తిని రేకెత్తించగలిగాడు. అయితే దాన్ని చివరి వరకూ పట్టుగా కొనసాగించలేకపోయాడు. భారీ అంచనాలు పెట్టుకోకుండా వెళ్లే.. ఈ సినిమాతో టైమ్ పాస్ అయిపోతుంది.
షినిషింగ్ టచ్: సగం పండిన ‘ఫాంటసీ’
తెలుగు360 రేటింగ్: 2.5/5
-అన్వర్