హైదరాబాద్ లోని ధర్నాచౌక్ వద్ద ఆందోళనలు చెయ్యకూడదు అంటూ కొన్నాళ్ల కిందట కేసీఆర్ సర్కారు ఓ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టు స్పందించింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం విధించిన ఆంక్షల్ని తాత్కాలికంగా ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ధర్నాచౌక్ ప్రాంతంలో ఆరు వారాలపాటు పోలీసుల అనుమతితో కూడిన నిరసన కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ధర్నా చౌక్ ఎత్తివేతపై ప్రభుత్వాన్ని వివరణ కోరినా, దాదాపుగా ఏడాదిగా సర్కారు స్పందించకపోవడంపై కూడా కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
నిజానికి, ధర్నాచౌక్ కి సంబంధించి కోర్టు ఇచ్చింది మధ్యంత ఉత్తర్వులే అయినా… ఈ నిర్ణయంపై ప్రజాస్వామ్యవాదులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం అనేది ఒక హక్కు. దాన్ని కాలరాస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకోవడంపై అప్పట్లోనే చాలా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఎవరు చేపట్టినా కేసీఆర్ సహించలేకపోతున్నారనీ, తెలంగాణ కోసం ఉద్యమాలు నిర్వహించేందుకు ఏ ధర్నాచౌక్ వాడుకున్నారో, దాన్నే తీసేస్తూ నిర్ణయం తీసుకోవడం సరికాదంటూ ప్రతిపక్ష పార్టీలతోపాటు, ఇతర సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు కూడా తప్పుబట్టారు. అయితే, హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యని బూచిగా చూపిస్తూ… నగరానికి దూరంగా ధర్నాలూ నిరసనలు చేసుకోవచ్చని సర్కారు చెప్పింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావు, విశ్వేశ్వరరావులు కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసుపై మంగళవారం నాడు ధర్మాసనం విచారణ చేపట్టి, తాజా ఉత్తర్వులు ఇచ్చింది.
ఓరకంగా, ఇది కాంగ్రెస్ కి సరైన సమయంలో దొరికిన మరో ప్రచాస్త్రమే అనుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంచి ఊపు మీదున్న ఈ తరుణంలో.. కోర్టు నుంచి వెలవడ్డ తాజా ఉత్తర్వులను తమ విజయంగానే కాంగ్రెస్ చెప్పుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక గొంతును నొక్కే ప్రయత్నం కేసీఆర్ చేశారనీ, ప్రజాస్వామ్య విలువలు తమకు తెలుసు కాబట్టే ధర్నాచౌక్ పునరుద్ధరణకు నోచుకుందని ప్రచారం చేసుకుంటారు. నిజానికి, ఇలా కోర్టు నుంచి కేసీఆర్ సర్కారుకి చాలా మొట్టికాయలు పడుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. పంచాయతీ ఎన్నికలు, ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం ఇలా చాలా అంశాల్లో కోర్టులో కేసీఆర్ సర్కారుకి చుక్కెదురైన పరిస్థితే.