ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వారాంతపు ఇంటర్యూలు మళ్లీ ప్రారంభించారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే పేరుతో మూడో సీజన్ ప్రారంభించారు. మొదటి సెలబ్రిటీగా షర్మిలను ఆహ్వానించడంతో అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. షర్మిలతో జగన్‌ను టార్గెట్ చేయిస్తారని అందరూ అనుకున్నారు. వీలైనంతగా వైసీపీలో మంట పెట్టేందుకు తన జర్నలిజం అనుభవం అంతా ఉపయోగిస్తారని అనుకున్నారు. ఉపయోగిoచారు కూడా. కానీ షర్మిల అన్ని ప్రయత్నాలను నిర్వీర్యం చేశారు. తాను చెప్పాలనుకున్నది మాత్రమే చెప్పారు.
జగన్ జైలుకెళ్తే ఎవరు సీఎం ? అన్న ప్రశ్నకు లౌక్యంగా షర్మిల సమాధానం !
ఆర్కే తన ఓపెన్ హార్ట్ ఇంటర్యూలో షర్మిలతో ప్రధానంగా.. జగన్ జైలుకెళ్తే తర్వాత సీఎం ఎవరు అనే అంశానికి సమాధానం రాబట్టాలని చూశారు. మొదటగా ఓ సారి ప్రశ్న అడిగినప్పుడు ఆ పార్టీ విధా విధానాల ప్రకారం ఆ పార్టీ నేతలే నిర్ణయం తీసుకుంటారని తనకేం సంబంధం లేదని చెప్పారు. చివరిలో మరోసారి అదే టాపిక్ తీసుకొచ్చారు. జగన్ తర్వాత వారసుసుల తల్లి అవుతారా.. వదిన అవుతారా అని ప్రశ్నించారు. ఇక్కడా షర్మిల బ్యాలెన్స్ తప్పలేదు. తనకు సంబంధం లేదని అంశంగానే స్పష్టం చేశారు. అయితే ఆర్కే అంతటితో వదిలి పెట్టలేదు. వైసీపీలో జగన్ కు యాభై శాతం కన్నా కొంత ఎక్కువ క్రెడిట్ ఉన్నా… ఆ పార్టీ కోసం కష్టపడిన షర్మిల కూడా ప్రధానమైన స్టేక్ హోల్డరేనని చెప్పుకొచ్చారు. అయినా షర్మిల మాత్రం ఎక్కడా తోట్రుపడలేదు.
అన్నపై అసంతృప్తిని ఎక్కడా రాజకీయ వివాద స్థాయిలో బయట పెట్టని చెల్లి షర్మిల !
ఒక వేళ షర్మిల తన మనసు ఏ మాత్రం ఏపీ వైపు ఉందన్న అభిప్రాయం కలిగించినా అది ఆమె తెలంగాణ పార్టీకి కోలుకోలేని దెబ్బ అవుతుంది. అందుకే ఆర్కే ఎంత తన అనుభవంతో ఒత్తిడి చేసినా ఆమె బ్యాలెన్స్ తప్పలేదు. అదే సమయంలో తమ కుటుంబంలో విబేధాలు ఉన్నాయని నేరుగానే ఒప్పుకున్నారు. ఎవరి కుటుంబాల్లో ఉండవని ఎదురు ప్రశ్నించారు. మీ కుటుంబంలో లేవా అని ఆర్కేనే ప్రశ్నించారు. అయితే ఏదీ కూడా తేల్చుకోలేనంత సమస్యలు కావని.. కూర్చుకుని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటనపై మాత్రం అసంతృప్తి !
తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టాలన్నది తన నిర్ణయమని అందుకే సొంత పార్టీ పెట్టుకున్ానని స్పష్టం చేశారు. ఈ విషయంపై చర్చలు జరిగాయి. జగన్ వద్దన్నారు. నా నిర్ణయం నేను తీసుకున్నాను. వారు చెబితే మానుకోవడానికి ఇది నేను ఎవరో చెబితే తీసుకున్న నిర్ణయం కాదుని షర్మిల స్పష్టం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేను పార్టీ పెట్టి మొదట అడుగు వేసిన రోజునే తమకేం సంబంధం లేదని ప్రకటించారని.. . వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వారు ఏమి అడిగినా నేను శక్తికి మించి చేశాను. పాదయాత్రతో సహా. ఏం సంబంధం ఉందని చేశానని కాస్త ఆవేదనా స్వతంతో ఆమె చెప్పారు. వైసీపీలో నేను ఎప్పుడూ సభ్యురాలిని కాదు. ఏ పదవి తీసుకోలేదు. వారికి అవసరమైనప్పుడు సాయం అడిగారు. నేను చేశాను అంత వరకేనని స్పష్టం చేశారు.
ఆస్తులన్నింటిలోనూ సగం వాటా !
మధ్యలో ఆస్తుల అంశాన్ని కూడా ఆర్కే లేవనెత్తారు. వైఎస్ సీఎంగా ఉండగా జగన్ ప్రారంభించిన వ్యాపారాలు.. సంపాదించిన ఆస్తుల్లో సమాన వాటా వస్తుందా అని ప్రశ్నించారు. వైఎస్ పిల్లల్ని ఎప్పుడూ వేరుగా చూడలేదని ఆయన అన్నారు. షర్మిల కూడా సమానంగానే చూశారని.. ఆ ఆస్తుల్లో సగం వస్తందని చెప్పారు. సాక్షి మీడియాలో కూడా సహ యజమానిననే చెప్పారు. ఇటీవల ఓటీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో షర్మిల ఇదే చెప్పారు.
తెలంగాణలో తన విజన్‌పై స్పష్టతతో ఉన్న షర్మిల
కొన్ని వ్యక్తిగత విషయాలను కూడా షర్మిల పంచుకున్నారు. పిల్లల గురించి.. భర్త రాజకీయ ప్రోత్సాహం గురించి ప్రకటించారు. అలాగే అనిల్ తో తన పెళ్లి గురించి కూడా చెప్పారు. అనిల్‌తో పెళ్లికి నాన్న అంగీకరించలేదు. వద్దని చెప్పడానికి చాలా నచ్చ చెప్పారు. కానీ తర్వాత అలా జరిగిపోయిందని గుర్తు చేసుకున్నారు. బ్రాహ్మిణ్ అయిన అనిల్ నాన్ వెజ్ ముందు నుంచీ తినేవాడు. వాళ్లఇంట్లో వాళ్లు తినరని చెప్పారు. తనను చూస్తే వైఎస్ గుర్తొస్తారని.. అందుకే ప్రజలు గుండెల్లో పెట్టుకుటారన్న నమ్మకంతో ఉన్నానని షర్మిల తేల్చేసారు. మొత్తంగా చూస్తే ఆమె ఆర్కే ట్రాప్‌లో పడలేదని.. అచ్చమైన రాజకీయ నేతగా వివాదాలు లేకుండా ఇంటర్యూను ముగించారని అనుకోవచ్చు. వైసీపీకి కూడా పెద్దగా టెన్షన్ పెట్టే విషయాలేమీ ఆమె మాట్లాడలేదని అనుకోవచ్చు.