గౌతమీపుత్ర శాతకర్ణి చూసి తెలుగు సినిమా అభిమానులు, బాలక్రిష్ణ అభిమానులు తెలుగు360 కి పంపిస్తున్న అనేక ఇ-మెయిల్స్ లో మరొకటి:
అంజనా పుత్ర క్రిష్ గారు,
తెర మీద గౌతమి మాత ఆశీస్సులతో, వశిష్ఠీ దేవి ఆలంబనతో “అఖండభారతం” అనే కల కని, “సమయం లేదు మిత్రమా శరణమా.. రణమా ? ” అని సమర శంఖం పూరించి జైత్రయాత్ర సాగించి, “తల దించకు…అది నేను గెలుచుకున్న తల”…అన్న శాతకర్ణి కథతో ప్రతీ తెలుగు వాడిని తలెత్తుకునేలా చేసారు. ఆసిక, అస్మక, అపరంత, మూలకాది రాజ్యాలన్నింటినీ శాతకర్ణి జయిస్తే, ఆంధ్రా, సీడెడ్, నైజాం, ఓవర్సీస్ అన్ని బాక్సాఫీస్లన్నీ మీకు దాసోహం అయ్యాయి.
తెర వెనుక అంజనా మాత ఆశీస్సులు, నూతన వధువు రమ్య గారి ఆలంబనతో “గౌతమిపుత్ర శాతకర్ణి” అనే కలగని సమయంతో సమరం చేసారు… తెర మీద శాతకర్ణి బాలయ్య ఐతే…తెర వెనుక శాతకర్ణి మీరయ్యారు.ఊగ్రసేన, హిరణ్యల సహకారంతో తెర మీద శాతకర్ణి సమర శంఖం పూరిస్తే, చిరంతన్ భట్, సాయిమాధవ్ బుర్రా ల సహకరంతో తెర వెనుక మీరు సమర శంఖం పూరించారు.
అఖండ భారత సాధన తర్వాత రాజసూయ యాగ అగ్ర పీఠం గౌతమి మాతదైతే,79 రోజులు అవిశ్రాంతంగా మీరు చేసిన ఈ కళా యజ్ఞానికి అగ్ర తాంబూలం నిస్సందేహంగా నందమూరి బాలకృష్ణ గారికే..చరిత్రలో పరాయి దేశంతో యుద్ధ సమయంలో ధర్మ నందనుడుది పాత్ర ఎంత కీలకమో,చరిత్ర సృష్టించిన ఈ సినిమాలో పార్వతిపుత్ర శివన్న గారి పాత్రా అంతే కీలకం.
రాజులు రాజ్య శాంతి కోసం కత్తులు పట్టాలి కానీ ప్రశాంతంగా చేపలు పడుతూ కూర్చోకూడదు అంటూ తెలుగు సినిమాకు సరికొత్త మార్గ”దర్శకత్వం” చేసారు.సామంతులలో శాతకర్ణి రగిలించిన స్పూర్తి మన చలన చిత్ర రంగంలో సహాయ దర్శకులలో మీరూ రగిలించ గలిగారు.కాలం చేసైనా కాలాన్ని కందాం అన్న శాతకర్ణి సాక్షిగా…సకాలంలో సినిమా పూర్తిచేసే కలగన్నారు. శాతకర్ణి తర్వాత మళ్ళీ పరాయిదేశపు కన్ను పడడానికి 1500 వందల ఏళ్ళు పడితే….మళ్ళీ ఇలాంటి సినిమా ఊహించడానికి కనీసం మరో 15 ఏళ్ళు అయినా పడుతుందేమో.. శాతకర్ణిది ఒకటే కల…కానీ మీరు మాత్రం ఇలాంటి కలలు కంటూనే ఉండాలనీ…సింహానికి చీమలు తోడు అయినట్లు….తెలుగు అభిమానులు కూడా మీతో ఉండాలని ఆశిస్తూ….
12 కోట్లలో ఒక చీమ…
Raam Narra – Raam.narra@gmail.com