నాలుగు రోడ్లు వేయడం.. నాలుగు ప్రాజెక్టులు కట్టడం అభివృద్ధి కాదని.. నిన్నటి కంటే ఈ రోజు బాగున్నామా లేదా అన్నదే అభివృద్ది అని సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ సారి చెప్పుకొచ్చారు. నిన్నటి కంటే ఇవాళ ఎలా బాగుంటామో ఆయనకు తెలియదు కాబట్టి.. ఆ విషయం తెలిసిన వాళ్లంతా ఫక్కున నవ్వారు. తెలియని వాళ్లు మా అన్న ఎంత గొప్పగా చెప్పారో చూశారా అనుకున్నారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే చెబుతున్నారు. వైసీపీ విజయం సాధించి నాలుగేళ్లయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. డెవలప్ మెంట్ అంటే చిన్న ఫ్యాక్టరీ లు 4, 5 పెట్టడం గొప్ప కాదన్నారు. అంటే ఉపాధి కల్పిండం కూడా అభివృద్ధి కాదని ఆయన చెబుతున్నారు.
అంటే మౌలిక సదుపాయాలు పెంచడం, యువతకు ఉపాధి కల్పించే పరిశ్రమలు తీసుకు రావడం ఇవేమీ వైసీపీ దృష్టిలో అభివృద్ధి కాదన్నమాట. మరి ఇక అభివృద్ధి అదంటే.. పోర్టులకు శంకుస్థాపనలు చేయడం.. అలాగే బటన్లు నొక్కడం అని చెబుతున్నారు. తాము ఇలాగే పరిపాలిస్తామని 2019 కన్నా మించిన విజయం ప్రజలు రానున్న రోజుల్లో అందించాలని కోరారు. అసలు ప్రజల అభివృద్ది బటన్లు నొక్కడం ద్వారా ఎలా సాధ్యమవుతుందో వీరికి తెలియనిది కాదు. కానీ అందర్నీ పేదల్ని చేసి.. ఆ పేదల్నే ఆకలితో అలమటించేలా చేసి.. చివరికి ఓ ముద్ద పెట్టి వారి ఓట్ల కొల్లగొట్టే వ్యూహం ప్రకారం పాలన జరుగుతోంది.
సజ్జల రామకృష్ణారెడ్డి తమ పాలనా శైలి ఎలాఉందో చెప్పకనే చెబుతున్నారు. ఒక్క అభివృద్ధి పని చేయడం కానీ.. పరిశ్రమల్ని తీసుకు రావడం కానీ చేయలేదని చెప్పకనే చెప్పారు. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు మళ్లీ ఎందుకు ఎన్నుకోవాలో కూడా ఆయన చెప్పాల్సి ఉంది. బటన్లు నొక్కడానికి కూడా రాష్ట్రాన్ని తాకట్టు పెడుతూంటే..ఇక మళ్లీ గెలిస్తే..బటన్లు కూడా ఎలా నొక్కుతారో చెప్పాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.