Operation Gold Fish Review
తెలుగు360 రేటింగ్: 1.5/5
ఉగ్రవాదం… చాలా బలమైన పాయింట్. దేశభక్తిని మేళవిస్తూ ఈ కథ చెబితే.. ఓ `ఊరి`లాంటి సినిమా పుడుతుంది. గురి తప్పితే అదే `అపరేషన్ గోల్డ్ ఫిష్` అవుతుంది. కమాండో ఆపరేషన్, ఉగ్రవాదుల్ని పట్టుకోవడానికి కమాండోలు వేసే వ్యూహాలు, ఉగ్రవాదుల రహస్య సంకేతాల్ని పట్టుకొని డీకోట్ చేయడం – ఇవన్నీ చాలా ఆసక్తిని కలిగించే విషయాలు. ఊరి లాంటి సినిమా చూసినా, లేదంటే `ది ఫ్యామిలీ మాన్`లాంటి వెబ్ సిరీస్ చూసినా – ఇలాంటి అంశాల్ని భలే టాకిల్ చేశారే అనిపిస్తుంది. నిజంగా.. ఉగ్రవాద నేపథ్యంలో సినిమా తీయాలంటే – దానికి ఎంత కసరత్తు చేయాలో, కథ కథనాలు ఎంత పకడ్బందీగా ఉండాలో అలాంటి సినిమాలు నిరూపిస్తాయి. లేదూ.. మేం కేవలం ఎమోషన్ని మాత్రమే పట్టుకుంటాం, టెక్నికాలిటీతో మాకు సంబంధం లేదు అనుకుంటే `రోజా`ని ఫాలో అవ్వాలి. అటు ఎమోషన్నీ, ఇటు కమాండో వ్యూహాల్నీ సరిగా అర్థం చేసుకోక పోతే `ఆపరేషన్ గోల్డ్ ఫిష్` లాంటి సినిమాలు పుడుతూనే ఉంటాయి.
కథలో గొప్ప విషయం ఏమీ లేదు. ఓ ఉగ్రవాదిని విడిపించడానికి.. మరికొంత మంది ఉగ్రవాదులు కేంద్రమంత్రి కూతురిని కిడ్నాప్ చేయాలనుకుంటారు. ఆ మంత్రి కూతురిని కాపాడడానికి రహస్య కమాండోలు పనిచేస్తుంటారు. అయినా సరే, వాళ్ల కళ్లను గప్పి – మంత్రి కూతుర్ని ఉగ్రవాదులు కిడ్నాప్ చేస్తారు. వాళ్ల చెర నుంచి మంత్రి కూతుర్ని ఎవరు, ఎలా కాపాడారు? అనేదే కథ. దానికి కశ్మీరీ పండిట్స్ నేపథ్యాన్ని తీసుకున్నారు. ఇండో – పాక్ సమస్య, దేశభక్తి మీద లెక్చర్లు, జీహాద్పై సరికొత్త నిర్వచనాలు.. ఇవన్నీ మామూలే.
ఈ సినిమా పట్టాలెక్కడమే విచిత్రమైన పద్ధతిలో ఎక్కింది. నటీనటులు టెక్నీషియన్లు ఎవరూ పారితోషికం తీసుకోలేదు. `సినిమా విడుదలయ్యాక వచ్చిన లాభాల్లో వాటా తీసుకుంటాం` అని చెప్పి ఈ సినిమాని మొదలెట్టారు. అంటే… పారితోషికాన్ని త్యాగం చేశారన్నమాట. అలాంటప్పుడు కథ ఎంత గొప్పగా ఉంటుందో అనుకుంటాం. కానీ… ఓ అరిగిపోయిన ఉగ్రవాద కథని ఎంచుకున్నాడు దర్శకుడు. ఇలాంటి కథలకు కావాల్సింది ఎమోషన్. అది ఎంత బలంగా ఉంటే, సినిమా అంత బాగుంటుంది. ఉగ్రవాదుల వ్యూహాలు, దాన్ని తిప్పికొట్టే కమాండోల నైపుణ్యం, ఉగ్రవాదులపై కమాండోలు జరిపే రహస్య దాడులు.. ఇవన్నీ ఆసక్తికరంగా ఉండాలి. దాన్ని కూడా మామూలు యాక్షన్ సినిమాల్లో ఫైట్స్లా చూపిస్తే… ఇక చెప్పేదేముంది? ఘాజీ బాబా (అబ్బూరి రవి)ని పట్టుకోవడానికి చేసే ఆపరేషన్ సాదా సీదాగా ఉంటుంది. దాన్ని బట్టి.. ఈ కథని చెప్పడానికి దర్శకుడికి ఉన్న నైపుణ్యం అర్థమైపోతుంది. ఆపరేషన్ తరవాత.. కథ కాలేజీ బాట పడుతుంది. అక్కడ ప్రేమలూ, స్నేహాల్నీ చూపిస్తూ కాలక్షేపం చేశాడు దర్శకుడు. అసలు నువ్వు ఎంచుకున్న రాగం ఏమిటి? ఆ తాళం ఏమిటి? అని అడగాలనిపిస్తుంది. కామెడీ కోసం కొన్ని సన్నివేశాలు అల్లుకున్నా అవేం పండలేదు.
సరికదా… దర్శకుడు ఆరోజు తనకు సెట్లో ఎదురుగా కనిపించినవాళ్లందరినీ కెమెరా ముందుకు తీసుకొచ్చేశాడు. ఆఖరికి ఈ సినిమాకి పనిచేసిన పీఆర్వోలను కూడా వదల్లేదు. రచయిత అబ్బూరి రవి, గీత రచయిత రామజోగయ్య శాస్త్రితో పాటు దర్శకుడు కూడా మొహానికి మేకప్ వేసుకున్నాడు.
మంత్రి కూతురికి ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని తొలి సన్నివేశంలోనే హీరోకి తెలుస్తుంది. అలాంటప్పుడు మంత్రి కూతుర్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ ఆమెను స్వేచ్ఛ పేరుతో గాలికి వదిలేస్తారు. అది ఏమాత్రం కన్వెన్సింగ్గా లేదు. అసలు పాయింట్ ఎప్పుడైతే తప్పిందో, అప్పుడు కథలో హీరో చేసే విన్యాసాలు ఫూలిష్గా అనిపిస్తుంటాయి. సదరు మంత్రి కూతురు కిడ్నాప్ అయ్యేంత వరకూ కథలో స్పీడు రాదు. ఆ తరవాత కమాండోలు చేసిన ఆపరేషన్ కూడా… ఊర్లో జేబు దొంగల్ని పట్టుకునే స్థాయిలోఉంటాయి. ఒకరిద్దరు కమాండోల్ని తీసుకుని, ఉగ్రవాదులపై దాడి చేయడం చూస్తుంటే.. సదరు సన్నివేశంలో జూనియర్ ఆర్టిస్టుల్ని కూడా పెట్టుకునేంత ఆర్థిక స్థోమత ఈ సినిమా నిర్మాతకు లేదా? అనిపిస్తుంది. కథలో అప్పటి వరకూ ట్రావెల్ చేసిన ఓ పాత్ర చనిపోతే.. ప్రేక్షకుడు భారంగా ఫీల్ అవ్వాలి. శ్రీకృష్ణుడ్ని చంపి.. ఆ ఫీలింగ్ తీసుకురావాలని చూశాడు దర్శకుడు. కానీ.. అప్పటికే కథతో కనెక్షన్ కట్ అయిపోవడం వల్ల.. ప్రేక్షకుడు పాత్రలపై ఎలాంటి సానుభూతీ వ్యక్తం చేయడు. పతాక సన్నివేశాల్లో కూడా ఫైట్ చేయనివ్వకపోతే ఆది అలిగి వెళ్లిపోతాడేమో అనుకుని – ఉగ్రవాదుల్ని ఒట్టి చేతులతో మట్టి కరిపించే బాధ్యత ఆదికి అప్పగించాడు దర్శకుడు.
సన్నివేశాల్లో బలం, పాత్రల మధ్య ఘర్షణ, బలమైన ఎమోషన్.. ఇవేం లేకపోతే ఎలాంటి కథా వర్కవుట్ అవ్వదు. దేశభక్తి, ఉగ్రవాదం కథలు అస్సలు అవ్వవు. కశ్మీర్ సమస్యను పైనుంచి టచ్ చేసి వదిలేసిన మరో కథ ఇది. అందుకే అటు ఉగ్రవాదం కాన్సెప్టుకీ, ఇటు మామూలు యాక్షన్ కమర్షియల్ కథకూ కాకుండా పోయింది. ఆది సాయికుమార్ సీరియస్గా కనిపించడం తప్ప.. కొత్తగా చేసిందేం లేదు. ఎయిర్ టెల్ పాపని హీరోయిన్ని చేశాం అని చెప్పుకోవడానికి మినహా.. తను ఈ కథకు ప్లస్ అయ్యింది లేదు. అబ్బూరి రవిలోని నటనా పటిమ చూపించడం కోసం దర్శకుడు ఈ సినిమా తీశాడేమో..? తన నటన కొత్తగా అనిపించకపోయినా, అబ్బూరి రివి కూడా నటించగలడు అని ఈ సినిమాతో అర్థమైంది. మనోజ్ నందం కూడా విలనీ ప్రదర్శించాడు.
బడ్జెట్ పరిమితులు తొలి సన్నివేశం నుంచే ప్రేక్షకుడికీ అర్థం అవుతూ ఉంటాయి. కనీసం డీఐ కూడా చేయలేదేమో.. చాలాసార్లు మొహాలు పౌడర్లు కొట్టినట్టు తెల్లగా పాలిపోయాయి. నేపథ్య సంగీతం ఇంపాక్ట్ చూపించలేదు. సంభాషణల్లో బలం లేదు. దర్శకత్వ ప్రతిభని ఆవిష్కరించిన సన్నివేశం ఒక్కటీ లేదు. ఈ కథలో ఉన్నది ఒక్కటే ట్విస్టు. అది కూడా తేలిపోయింది.
ఉగ్రవాదం – దేశభక్తి.. ఇవి రెండూ బలమైన పాయింట్లు. కథలో ఇవి చూపించాలంటే అందుకు తగిన సన్నివేశాల్ని రాసుకోవాలి. లేదంటే.. ఆ ప్రయత్నాలేం ఫలించవు అని చెప్పడానికి ఈ ఆపరేషన్ ఓ ఉదాహరణగా మిగిలిపోతుంది.
పినిషింగ్ టచ్: చేప దొరకలేదు
తెలుగు360 రేటింగ్: 1.5/5
నటీనటులు : ఆది, నషా చెత్రి, అనీష కురువిల్లా, మనోజ్ నందన్, అబ్బూరి రవి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్య నరేష్, క్రిష్ణుడు, రావు రమేష్
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
నిర్మాతలు: ప్రతిభ అడవి, కేశవ్ ఉమ స్వరూప్, పద్మనాభ రెడ్డి
దర్శకుడు: అడవి సాయికిరణ్
విడుదల తేది: 18-10-2019