Operation Valentine Telugu Review
తెలుగు360 రేటింగ్: 2.5/5
-అన్వర్
దేశభక్తి కూడా ఓ కమర్షియల్ ముడిసరుకే. మాస్, క్లాస్, యూత్, ఫ్యామిలీ ఇలా అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యే జోనర్ ఇది. బాలీవుడ్ తో పోల్చుకుంటే తెలుగులో ఈ జోనర్ చిత్రాలు తక్కువనే చెప్పాలి. కానీ ఇక్కడ నుంచి కూడా అడపాదడపా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశాన్ని కుదిపేసిన ముంబై దాడుల నేపధ్యంలో అడివి శేష్ చేసిన ‘మేజర్’ సినిమా మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఇప్పుడే అదే నిర్మాణ సంస్థలో అలాంటి వాస్తవిక ఘటనల నేపధ్యంలోనే వరుణ్ తేజ్ ఓ చిత్రం చేశాడు. అదే.. ఆపరేషన్ వాలెంటైన్. దేశాన్ని కదిలించిన పుల్వామా దాడి నేపధ్యంలో రూపొందిన చిత్రమిది. ఈ సినిమాలో హిందీలో కూడా తెరకెక్కడంతో వరుణ్ తేజ్ కి మెడిన్ బాలీవుడ్ మూవీ అయ్యింది. మరి ఇన్ని విశేషాలున్న ఈ చిత్రం ప్రేక్షకులని అలరించిందా? ఇందులో భావోద్వేగాలు మన ప్రేక్షకుల్ని హత్తుకునేలా ఉన్నాయా?
అర్జున్ అలియాస్ రుద్ర (వరుణ్ తేజ్) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వింగ్ కమాండర్. దూకుడు ఎక్కువ. ఫైటర్ ఎయర్ క్రాఫ్ట్స్ ని టెస్ట్ చేయడంలో దిట్ట. తనకి ఓ చేదు గతం కూడా వుంటుంది. 2019లో పుల్వామా దాడి జరుగుతుంది. ఈ ఘటనలో 40 మందికి పైగా సైనికులను కోల్పోతుంది. దీనికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలాంటి వార్ సిద్ధమైయింది? ఈ ఆపరేషన్ లో వింగ్ కమాండర్ రుద్ర ఎలాంటి ధైర్య సాహసాలు చూపించాడు? ఇందులో అహ్న గిల్ ( మానుషి చిల్లర్) పాత్రేమిటి? ఇవన్నీ తెరపై చూడాలి.
యదార్థ సంఘటనల ఆధారంగా సినిమా తీయడానికి చాలా నేర్పు కావాలి. జరిగిన కథ, అందులోని మలుపులు, విశేషాలు టీవీల్లో, పత్రికల్లో ఆల్రెడీ వచ్చేసుంటాయి కాబట్టి ఆశ్చర్యపరిచే అంశాలు పెద్దగా వుండవు. జరిగిన సంఘటన ఎంత ప్రామాణికంగా సహజంగా చుపిస్తున్నాం? అందులోని ఎమోషన్ ని పట్టుకున్నామా లేదా? అనే అంశాలపైనే సినిమా విజయం ఆధారపడి వుంటుంది. ఆపరేషన్ వాలెంటైన్ ఆ ఎమోషన్ ఉన్నా, ప్రేక్షకులని కథలో లీనం చేసే అంశాలే కొరవడ్డాయి. జరిగిన సంఘటన ఏమిటో అందరికీ తెలుసు. ఇలాంటి సమయంలో చాలా గ్రిప్పింగ్ గా కథని నడపాల్సిందిపోయి ఇందులోనూ కాలక్షేపానికి అన్నట్టు హీరో హీరోయిన్ మధ్య ఎదో అద్భుతమైన అనుబంధం వున్నట్లుగా చూపించిన ఆరంభ సన్నివేశాలు ఈ కథకు అంతగా అతకలేదు. పైగా వారి కెమిస్ట్రీ సరిగ్గా రిజిస్టర్ కూడా చేయలేదు.
ఇందులో రుద్ర పాత్రకు ఎదో ఒక చేదు గతం వుంటుంది. దాన్ని కూడా సాగదీసి వదిలారు. ఆ చేదు అనుభవాన్ని హీరో ఫీలౌతుంటాడు కానీ ఆడియన్ కి ఎలాంటి ఫీలింగ్ కలగదు. కథ మొదలైన తర్వాత ఏదో పాయింట్ దగ్గర ప్రేక్షకుడు అందులో ఎంగేజ్ కావాలి. ఇందులో మాత్రం సన్నివేశాలన్నీ అలా చప్పగా వెళ్ళిపోతుంటాయి గానీ ఎక్కడా ఎమోషనల్ కనెక్షన్ రాదు. ఇంటర్వెల్ బాంగ్ దగ్గర వచ్చే ఎయిర్ యాక్షన్ సీక్వెన్స్ ని మాత్రం బాగా డిజైన్ చేశారు. పైన రుద్ర యుద్ధ విమానంలో ఉంటాడు., కింద పుల్వామా దాడి జరుగుతుంది. ఈ ఎపిసోడ్ బాగా రక్తి కట్టింది. పుల్వామా దాడి ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడ్ అవ్వడంతో ఆపరేషన్ వాలెంటైన్ ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. నిజానికి ఇది ఇంటర్వెల్ లా అనిపించదు. కథ ఇప్పుడే మొదలుపెట్టారనే భావన కలుగుతుంది.
సెకండ్ హాఫ్ అంతా గాల్లోనే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్ శిబిరాలపై చేసిన దాడి వరకూ ఓకే కానీ తర్వాత చేసిన దాడులు, పాక్ ప్రతిదాడి ఇవన్నీ గందరగోళంగా వుంటుంది. దర్శకుడు ఈ కథ కోసం ఏం రీసెర్చ్ చేశాడేమో కానీ ఒక రాడార్ డిస్ ప్లే చూపించి అందులో ఓ పది వినమానాలు తిరుగుతునట్లుగా చేసి. గాల్లో కార్లు నడుపుతున్నట్లు ఒక లక్ష్యం అంటూ లేకుండా ఏదో వీడియో గేమ్ అన్నట్టుగా తీసుకుంటూ వెళ్ళాడు. ఒక దశలో ఏం జరుగుతుందనే క్వశ్చన్ మార్క్ ఫేస్ తో చూస్తుంటాడు ప్రేక్షకుడు. ఇదే థీమ్‌తో ఇటీవలే వచ్చిన ఫైటర్ లో దర్శకుడు టెక్నిక్‌ని పట్టుకొన్నాడు. కథని నేల మీదకు తీసుకొచ్చి చెప్పే ప్రయత్నం చేశాడు. తెరపై ఏం జరుగుతుందో అర్ధమౌతుంటుంది. కానీ ఈ ఆపరేషన్ మాత్రం ఎంతకీ అంతుచిక్కనట్లుగా వుంటుంది. పైగా వాస్తవిక ఘటనల్ని తెరపైకి తీసుకొచ్చినప్పుడు ఒక పాత్రకంటూ స్పెషల్ గా ఎలివేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో మాత్రం రుద్ర పాత్రని ఓ పాత తరం హీరోకి ఇచ్చిన ఎలివేషన్ ఈ కథకు అంతగా రుచించదు. యాక్షన్ సినిమాలకు ఓకే కానీ, యదార్థ సంఘటనలకు అలాంటి సన్నివేశాలు మ్యాచ్ కాలేదు.
వరుణ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే పాత్రే ఇది. తన పాత్ర వరకూ సహజంగా చేశాడు. నిజానికి ఇలాంటి పాత్రలు చేయడంలో ఓ సవాల్ వుంటుంది. సెకండ్ హాఫ్ లో చాలా వరకూ ఫేస్ కి మాస్క్ పెట్టుకునే వుండాలి. కేవలం కళ్ళతోనే ఎమోషన్ పలికించాలి. ఈ విషయంలో తన శక్తి మేరకు కష్టపడాడు. మానుషి చిల్లర్ పాత్రకు నిడివి వుంది కానీ ఆ పాత్రలో ఎమోషన్ లేదు. తన స్క్రీన్ ప్రెజన్స్ పాత్రకు సరిపోయేలా వుంది. నవదీప్ వున్నాడు కానీ తనకి ఒక్క డైలాగ్ లేదు. రుహని శర్మ పాత్రకు పెద్ద ప్రాధన్యత లేదు. చాలా మంది సపోర్టింగ్ యాక్టర్స్ కనిపిస్తారు కానీ ఎవరి పాత్ర చెప్పుకునేలా వుండదు.
టెక్నికల్ గా సినిమా ఓకే అనిపిస్తుంది. నిర్మాణంలో పరిమితులు కనిపిస్తాయి. సిజీ వర్క్ ని ఇంకా పక్కాగా చేయాల్సింది. చాలా చోట్ల వీక్ వీఎఫ్ఎక్స్ వర్క్ కనిపిస్తుంది. మిక్కీ జే మేయర్ తన స్టయిల్ లో నేపధ్య సంగీతం చేశాడు. పాటలు వున్నాయి కానీ రిజిస్టర్ కావు. తెలుగు మాటలు బాగానే కుదిరాయి. అయితే సన్నివేశంలో బలం లేకపోవడంతో ఆ మాటలు కూడా విడిగానే వినిపిస్తాయి. దర్శకుడు ఈ సినిమా కోసం బాగానే రిసెర్చ్ చేశాడు. అయితే ఆ రిసెర్చ్ ని జనరంజకంగా చూపించడంలో తడబడ్డాడు. ఎయిర్ ఫోర్స్ కి సంబధించిన మెటిరియల్ వుందని టెక్నికల్ టెర్మినాలజీ అంత వాడేస్తే హిస్టరీ స్టూడెంట్ కి మాథ్స్ చెపినట్లుగా వుంటుంది. ఇందులో కూడా అదే జరిగింది. అనర్గళంగా వినిపించే ఆ టెక్నికల్ పదాలు ఆ సబ్జెక్ట్ పై కాస్తో కూస్తో అవగాహన ఉన్నవాళ్ళకే అర్ధమౌతాయి. ఒక సీన్ తీసినప్పుడులో అందులో ఎమోషన్ ఏమిటి? దానికి ప్రేక్షకుడు ఎందుకు కనెక్ట్ కావాలి? ఇలాంటి సెల్ఫ్ చెక్ దర్శకులకు వుండాలి. ఈ సినిమా విషయంలో అవేవీ లెక్క చేయలేదు దర్శకుడు. ఇలాంటి కథలు అంతర్లీనంగా జరిగిన ఘటన తాలూకు తీవ్రతని, నష్టాన్ని, దాని వల్ల కలిగిన బాధని, ఈ కథ చూస్తున్న ప్రేక్షకుడిలో సానుభూతిని వెరసి దేశభక్తిని రగిలించేలా వుండాలి. అప్పుడే ఇలాంటి సినిమాకి ప్రేక్షకుల ఆదరణ వుంటుంది. ఈ విషయంలో మాత్రం ఆపరేషన్ సక్సెస్ కాలేకపోయింది.
తెలుగు360 రేటింగ్: 2.5/5
-అన్వర్