కేకే కూడా కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆసలు ఆయన ఎవరు ?. రాజకీయంగా ఆయన పలుకుబడి ఎంత ?. అని ఆలోచిస్తే… ఆయన వెంట పది మంది ఓటర్లు ఉంటారని ఎవరూ అనుకోరు. కనీసం ఢిల్లీలో పలుకుబడి ఉందా అంటే.. ఆయనను ఎవరూ సీరియస్ గా తీసుకోరు. అయినా కాంగ్రెస్ నుంచి తెచ్చుకుని చాలా ప్రయారిటీ ఇచ్చి రాజ్యసభ సీట్లు ఇచ్చి.. కుమార్తెకు హైదరాబాద్ మేయర్ పదవి ఇస్తే.. ఇప్పుడు ప్రభుత్వం మారగానే .. మా సొంత పార్టీ కాంగ్రెస్ అంటూ చేరిపోయేందుకు రెడీ అయ్యారు.
ఇలాంటి అవకాశవాదం ఒక్క కేకేనే కాదు… పార్టీ వీడిపోతున్న అందరిలోనూ ఉంది. దానం నాగేందర్ దగ్గర నుంచి ప్రకాష్ గౌడ్ వరకూ అందరూ అంతే. వీరిలో అత్యధిక మందిని కేసీఆర్ నయానో.. భయానో పార్టీలో చేర్చుకున్నారు. వారు చేరే ఆసక్తి లేకపోయినా వివిధ మార్గాలు ప్రయోగించి చేర్చుకున్నారు. వారి వల్ల ఆయన ఎంత లాభపడ్డారో తెలియదు కానీ.. కష్టసమయంలో మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. వారంతా మరో ఆలోచన లేకుండా గుడ్ బై చెబుతున్నారు.
కేసీఆర్ తాను గుప్పిడు మందితో తెలంగాణ ఉద్యమం ప్రారంభించానని చెబుతారు. అది నిజం కూడా. ఆయన ఉద్యమం ప్రారంభించినప్పుడు ఆయనతో ఉన్న వారు ఇప్పుడు లేరు. ఆయనతో సుదీర్ఘ కాలం ఉన్న వారికి ప్రాధాన్యం దక్కలేదు. ఇప్పటికీ పార్టీలో .. ఉద్యమ సమయం నుంచి ఉన్న వారు ఉన్నా వారెవరికి చిన్న పదవులు కూడా రాలేదు. కానీ ఉద్యమకారులపై దండెత్తిన దానం వంటి వారు పార్టీలో ప్రముఖులయ్యారు. సమైక్యవాది తలసాని మంత్రి అయ్యారు.
కేసీఆర్ ను నమ్ముకుని ఉన్న వారు ఇప్పటికీ ఉన్నారు. మధ్యలో వచ్చి అధికారం అనుభవించి మధ్యలోనే వెళ్లిపోతున్న వారు ఉన్నారు. కేసీఆర్ ఇప్పుడు తన వాళ్లను దూరం చేసుకున్నారు… అధికారం కోసం దగ్గరకు వచ్చిన వాళ్లూ దూరం అవుతున్నారు. ఇది కేసీఆర్ స్వయంకృతమే.