కేసీఆర్ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పనులు చివరి దశకు వచ్చేశాయనీ, పూర్తి అయిపోతోందంటూ ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా త్వరలో నీటిని విడుదల చేయబోతున్నామనీ, ఇదో గొప్ప మోడల్ కాబోతోందని ఇప్పటికే మంత్రి హరీష్ రావు చాలాసార్లు చెప్పారు. అయితే, ఇంకోపక్క ఇదే ప్రాజెక్టును లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలకి దిగుతూ ఉండటం గమనించదగ్గ విషయం. అంతేకాదు, రౌండ్ టేబుల్ నిర్వహించి దీన్లో చాలా అవకతవకలున్నాయంటూ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఓ ప్రెస్ మీట్ పెట్టి… కాళేశ్వరం విషయంలో కేసీఆర్ సర్కారు చేస్తున్న ప్రచారార్భాటమేననీ, ఇది దేశ చరిత్రలోనే ఇదొక విఫల ప్రాజెక్టు అంటూ ఆయన విమర్శించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులంతా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదనీ, వాటి పేరుతో జరుగుతున్న అవినీతిని కాంగ్రెస్ ఎన్నటికీ సహించదంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఇదే అంశాన్ని ప్రధానాస్త్రంగా చేసుకుని ఈరోజున తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ కూడా ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై సమగ్ర దర్యాప్తు తప్పకుండా జరగాలని డిమాండ్ చేశారాయన. నిధులు దుర్వినియోగానికీ, కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి, అధికారులు లాభాలు చేకూర్చే విధంగా మాత్రమే ఈ ప్రాజెక్టు ఉందని కోదండరామ్ ఆరోపించారు. అంతేగానీ, ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చే విధంగా లేదన్నారు. కాళేశ్వరంపై దర్యాప్తు తప్పనీ, ఆరోజు వస్తే.. ఇవాళ్ల పెద్ద మాటలు చెబుతున్న అధినాయకులంతా చంచల్ గూడ జైలు వెళ్లాల్సి వస్తుందని కోదండరామ్ వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే, తెరాస కూడా ఈ విమర్శలపై ఘాటుగానే స్పందిస్తోంది. అధికారం దక్కలేదన్న అక్కసుతోనే తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు కాంగ్రెస్ అడ్డుతగులుతోందని మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఉన్నట్టుండి తెలంగాణ విపక్షాలు కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వంపై ఆరోపణలు పెంచడం గమనార్హం! ఈ విమర్శల్ని తెరాస సర్కారు పెద్దగా పరిగణించడం లేదు. వారి ధీమా వారికి ఉంది. అయితే, అవినీతి జరిగిందంటూ పార్టీలన్నీ మూకుమ్మడిగా దాడి చేస్తుండటంతో ప్రజల్లో కొంత చర్చకు మాత్రం ఆస్కారం. ప్రాజెక్టు అవినీతిపై చర్చకు సిద్ధమా అంటూ ఇప్పటికే కాంగ్రెస్ కూడా సవాలు చేసింది. మరి, ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే… ఇలాంటి కార్యక్రమం ఏదైనా అధికార పార్టీ చేపట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే, కేసీఆర్ ఓ మీటింగ్ పెట్టి… గుండుగుత్తంగా అన్ని పార్టీల విమర్శలకీ సమాధానం చెప్తారనీ భావించొచ్చు. ప్రస్తుతానికి తెలంగాణలో విపక్షాల మధ్య భావసారూపత్యకు కాళేశ్వరం ప్రాజెక్టు అంశం ఉపయోగపడుతున్నట్టుగా చూడొచ్చు.