ప్రభుత్వం అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రమే కాదని విపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా అని సీఎం రేవంత్ రెడ్డి . . బీజేపీ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావు జీవిత చరిత్ర ఉనిక పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా వ్యాఖ్యానించారు. మన రాజ్యాంగ నిర్మాతలు చెప్పింది అదే. బలమైన ప్రతిపక్షం ఉన్న రాష్ట్రంలో పాలన సజావుగా సాగుతుంది. అధికారంలో ఉన్న వారు తప్పులు చేయడానికి భయపడతారు. అలాంటి ప్రతిపక్షంగా ఎప్పుడూ రెడీగాఉండాలి. వారి పోరాటం నచ్చితే ప్రజలు తర్వాత పట్టం కడతారు.
రేవంత్ రెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యేల మాటలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గత పదేళ్లుగా అసెంబ్లీ జరిగిన వైనం.. కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న వైనం చూస్తే ఖచ్చితంగా ఆయన తన మాటల్ని పాటించే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవచ్చు. కానీ విపక్షం అలా అనుకోవడం లేదు. ప్రధాన ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావడం లేదు. ఆయన తరపున కేటీఆర్, హరీష్ రావు రాజకీయాలు చేస్తున్నారు. అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. కానీ కేసీఆర్ రాకపోవడాన్ని సమర్థించుకోలేకపోతున్నారు.
రేవంత్ రెడ్డికి ఉన్న అవగాహన, ఆయన చెబుతున్న విషయాలను బట్టి చూస్తే.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతను అవమానించేంతటి పని చేయరు. అలా చేస్తే ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. అయితే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అనేక. విషయాలను బయటపెట్టే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ధైర్యంగా ఎదుర్కోవడమే ప్రతిపక్షం చేయాల్సిన రాజకీయం. తాము మంచి చేశామని ఇక్కడే నిరూపించుకునే అవకాశం ఉంటుంది.
కారణం ఇదైనా ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయి. ఏపీలో ప్రతిపక్షం లేదు. హోదా ఇస్తేనే ప్రతిపక్షంగా ఉంటామని జగన్ అంటన్నారు. తెలంగాణలో ప్రభుత్వంలో భాగమే అని స్వయంగా సీఎం చెబుతున్నా.. ఆ రోల్ కు వచ్చేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్దపడటం లేదు. ఎవరి రాజకీయాలు వారివి.