జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగాల్లో రెండు మూడు రోజుల నుంచి ఓ మాట పదే పదే వస్తోంది. తాను బలమైన ప్రత్యర్థినని గుర్తు పెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేతకు గుర్తు చేస్తున్నారు. మూడు రోజుల కిందట.. ఓ ట్వీట్ చేస్తూ.. తనకు పదిశాతం ఓట్లు ఉన్నాయని చెప్పుకున్నారు. అదీ కూడా.. అధికార పార్టీ చేసిన సర్వేలోనే వెల్లడయిందని చెప్పుకొచ్చారు. అధికార పార్టీ సర్వే చేసుకుందని.. అందులో పవన్ కల్యాణ్ పార్టీకి పది శాతం ఓట్ల బలం ఉందని ఎవరు చెప్పారో కానీ… అదే పవన్‌కు గొప్ప సంతోషాన్నిచ్చినట్లుగా ఉంది. పది శాతంతో ప్రారంభించి… ఎక్కడికో వెళ్లిపోదామని అభిమానులకు సందేశం ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని.. ఏ సభలో అయినా ప్రసంగం ప్రారంభంలో ధీమా వ్యక్తం చేసే పవన్ .. చివరికి వచ్చేసరికి… చంద్రబాబుకు వార్నింగ్ ఇవ్వడానికి.. నేను గెలవకపోవచ్చు… కానీ టీడీపీని ఓడించగలనని బెదిరిస్తూంటారు. దానికి ఈ పది శాతం ఓట్ల లెక్క ఆయనకు ధైర్యాన్నిచ్చి ఉంటుంది. నిజానికి అధికార పార్టీ అభిప్రాయసేకరణ చేసిందో లేదో ఎవరికీ తెలియదు. సహజంగా పవన్ కల్యాణ్.. వాళ్లు చెప్పారు.. వీళ్లు చెప్పారు అంటూ ఉంటారు.. కాబట్టి.. అలా ఎవరో అధికార పార్టీ సర్వే అంటూ.. చెప్పి ఉంటారు. అందుకే తాను ఓ ప్రధాన ప్రత్యర్థినని గుర్తు పెట్టుకోవాలని సలహా ఇస్తున్నారు.
విశాఖ కవాతులో మరో విచిత్రమైన ప్రకటన కూడా చేశారు. గురువు, దైవం లాంటి అన్నయ్యను కాదని టీడీపీకి సపోర్ట్ చేశారట. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిరంజీవికి సపోర్ట్ చేసి ఉంటే.. నిజంగానే అసలు పవన్ కల్యాణ్.. జనసేన బలం ఏమిటో తేలిపోయి ఉండేది. ఆయన టీడీపీని గెలిపించేవారో కాదో తేలిపోయేది. నేను ప్రధాన ప్రత్యర్థిని అని ఎవరికి వారు సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటే ప్రత్యర్థులు కారు. రాజకీయాల్లో అసలు కారు. ఎవరు ప్రత్యర్థి.. ఎవరు విజేత… ఎవరు పోటీ దారు అన్నది ప్రజలు తేల్చాలి. ప్రజలంటే.. సినిమా హీరో కదా అని చూడటానికి ఎగబడి వచ్చే కాలేజీ పిల్లలు కాదు. అసలు ఓటర్లు వేరే ఉంటారు. వారే రాజకీయ నేతల భవిష్యత్‌ను నిర్ణయించేవాళ్లు. పవన్ కల్యాణ్ ఈ విషయం తెలుసుకోవాల్సి ఉంది.
—- సుభాష్