దేశం అత్యంత కీలకమైన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సిద్ధమయింది. ఈ సమయంలో దర్యాప్తు సంస్థలు దూకుడు చూపిస్తున్నాయి. కేసుల పేరుతో కొంత మందిని అరెస్టు చేస్తున్నాయి. ఈ అరెస్టులు జరుగుతున్న వారిలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన కీలక నేతలు ఉండటమే అసలు రాజకీయానికి కారణం అవుతోంది. ముఖ్యంగా అరెస్టుల టైమింగ్ అందర్నీ ప్రశ్నింపచేసేలా ఉంది.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను రాత్రికి రాత్రి అరెస్టు చేశారు. అంతకు ముందు ఢిల్లీ హైకోర్టు అరెస్టు చేయకుండా ఊరటనివ్వలేమని తేల్చేసింది. గంటల్లోనే ఇంటిపై దాడి చేసి అరెస్టు చేశారు. ఈడీకీ ఆ అధికారాలు ఉన్నాయి. అంతకు రెండు రోజుల ముందు రౌస్ అవెన్యూ కోర్టులో ఆయనకు ఊరట లభించింది. కానీ ఆ జడ్జి వెంటనే బదిలీ అయిపోయారు. రెండు రోజుల్లో కేజ్రీవాల్ అరెస్ట్ జరిగిపోయింది. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ ఫోర్స్ లో ఉంది.
గత వారమే కవితను అరెస్టు చేశారు. అది కూడా సేమ్ కేసు. కానీ ఈ కేసులో ఆధారాలు ఇప్పుడే బయటపడ్డాయా అంటే.. చార్జిషీట్లు కూడా వేసి నెలలు దాటిపోయింది. కానీ ఎన్నికలకు ముందే అరెస్టు చూపించారు ?. అరెస్టు చేయాలనుకుంటే ఎప్పుడో చేయవచ్చు.. ఇప్పుడు ఎన్నికల సమయంలో చేయాలనుకోవడం ఖచ్చితంగా రాజకీయమే అవుతుంది. ప్రత్యర్థులను కేసుల్లో ఇరికించి.. జైళ్లకు పంపి.. తాము ఎన్నికలకు వెళ్లాలనుకోవడం .. ప్రజాస్వామ్య రాజకీయం కాదు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆధారాలు ఉంటే.. ఎప్పుడో అరెస్టు చేయాల్సింది. నెలల తరబడి నాన్చి అవసరమైనప్పుడే అరెస్టు చేయడం రాజకీయమే అవుతుంది. ప్రజలు దీన్ని నమ్మిన రోజు అధికార దుర్వినియోగం చేసినందుకు… ఓటుతోనే శిక్షించే అకాశం ఉంది