తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కౌలు రైతులపై దాదాపుగా పగ బట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. “రైతు బంధు” పథకానికి కౌలు రైతులు అర్హులు కారని మొదటి నుంచి చెబుతున్నారు. వారసులు రైతులే కాదన్నట్లు చెప్పుకొస్తున్నారు. అదీ కూడా పరుషమైన భాషలో… కౌలు రైతు మనసు గాయపడేలా చెబుతున్నారు. దీనిపై నిరనసలు వ్యక్తమవుతున్నా… విపక్ష పార్టీలు దీన్నో అంశంగా తీసుకున్నా.. వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు కొత్తగా తెలంగాణ కౌలు రైతుల రక్షిత చట్టాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని సీరియస్‌గా ఆలోచిస్తున్నారు.
తెలంగాణ కౌలు రైతుల రక్షణ చట్టం-1950 సెక్షన్ -10(4) ప్రకారం.. పంట రుణాలు పొందడానికి వీలుగా వారికి రుణ అర్హత కార్డులు జారీ చేస్తూ వస్తున్నారు. అయితే కౌలు రైతులను గుర్తించే ప్రసక్తే లేదని.. వారిని గుర్తిస్తే భూ యజమానులకు ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. కొత్తగా జారీ చేసిన.. పట్టాదారు పాస్ పుస్తకాల్లో అనుభవదారు అనే కాలమ్‌ను తీసేసింది. కౌలు రైతుల రక్షిత చట్టం ఉంటే కార్డులు అడగడానికి అవకాశం ఉంటుంది. అందుకనే దీన్ని రద్దు చేయాలని దాదాపుగా నిర్ణయించేసుకుంది. ఆర్డినెన్స్ జారీ చేసే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంది.
వాస్తవానికి కౌలు రైతులకు జారీ చేసే వారికి రుణ అర్హత కార్డులను రెండేళ్ల నుంచి జారీ చేయడం పూర్తిగా తగ్గించారు. ఇప్పుడు ఇక దరఖాస్తులు కూడా తీసుకునే అవకాశం లేదు. రైతు బంధు పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో… కౌలుదారులకు అందకుండా ఉండేందుకు.. భూ రికార్డుల నవీకరణకు ముందే జాగ్రత్తలు తీసుకున్నారు. పహాణీలో అనుభవదారు అనే కాలమ్ వద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఇది ఉంటే.. అక్కడ కౌలు రైతు పేరు రాసేవారు. బ్యాంకుల్లో పంట రుణం పొందే వీలుండేది. ప్రభుత్వం నుంచి విత్తన, ఎరువుల సబ్సిడీలు పొందే అవకాశం కలిగేది. ఇప్పుడు.. తెలంగాణలో కౌలు రైతులు.. అసలు రైతులు కాకుండా పోయారు. అచ్చంగా కేసీఆర్ పగబట్టి చేశారా అన్నట్లుగా వ్యవహారం మొత్తం జరిగిపోతోంది.