కిందపడ్డా కూడా పైచేయి నాదే అని చెప్పుకోవడం ఒక్క కేసీఆర్ సాబ్ కి మాత్రమే సాధ్యం! ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో ఆయన తగ్గాల్సి వచ్చింది. ఒత్తిళ్లకు చివరికి తలొగ్గాల్సి వచ్చింది. సెల్ఫ్ డిస్మిస్ అనీ, ఆర్టీసీకి ముగింపు మూసేయడమే అనీ… ఇలా భారీ ప్రకటనలు చేసి, ఇప్పుడు పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. కానీ, ఆ టర్న్ ని కూడా దాన్ని తన దయాగుణంగా మార్చి ప్రొజెక్ట్ చేశారు, డౌన్ డౌన్ అని నినదించిన కార్మికులతో పాలాభిషేకాలు అందుకుంటున్నారు! దటీజ్ కేసీఆర్. ఏదైతేనేం దాదాపు రెండునెలలపాటు సాగిన సమ్మెకు ఫుల్ స్టాప్ పడింది. అయితే, ఇక్కడ ప్రతిపక్షాలు నేర్చుకోవాల్సి చాలా ఉంది. తాను యూటర్న్ తీసుకుంటూ కూడా ప్రతిపక్షాలపై మరో దెబ్బ వేసేశారు కేసీఆర్! నిన్నమొన్నటి దాకా కార్మికుల పక్షాన మాట్లాడుతూ వచ్చిన ప్రతిపక్ష పార్టీలు.. ఇప్పుడు నోరు మూసుకుని చోద్యం చూడాల్సిన పరిస్థితి. ఇంతకు ముందు కూడా ఇలానే ప్రతిపక్షాలను తన ట్రాప్ లో పడేస్తూ నడిపించారు కేసీఆర్.
గడచిన రెండునెలలే తీసుకుంటే… ఒక్క ఆర్టీసీ ఇష్యూ చుట్టూ మాత్రమే ప్రతిపక్షాలు చక్కర్లు కొట్టాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఆ ఒక్క అంశమే బాగా ప్లస్ అయిపోతుందని భావించి, మిగతావి పట్టనట్టుగా కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలూ వ్యవహరించాయి. ఆర్టీసీ సమ్మె వ్యవహారాన్ని ఘాటైన వ్యాఖ్యలతో కెలుకుతూ ప్రతిపక్ష నాయకుల్ని ఆ ఒక్క అంశం మీద మాత్రమే ఫోకస్ చేసేలా కేసీఆర్ నడిపించడంలో సక్సెస్ అయ్యారు! వేరే సమస్యపై ప్రతిపక్షాలు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నడిపించారు. ఫలితం ఏమైందో తెలిసిందే. ఈ సమ్మె తమకేదో రాజకీయంగా మేలు చేస్తుందీ అనుకుంటే… చివరికి నెపాన్నంతా ప్రతిపక్షాలు, యూనియన్లపై నెట్టేసి…. కేసీఆర్ మనసున్న నాయకుడు అనే ప్రొజెక్షన్ తో ఇప్పుడు కార్మికులను ఆకర్షించేశారు!
ఇప్పటికైనా ప్రతిపక్షాలు ఇది గుర్తించాలి. రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి. రెండోసారి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఇదీ అని చెప్పుకోవడానికి ఏదీ లేదు. మంత్రి వర్గ ఏర్పాటే ఆలస్యంగా తనకు నచ్చినట్టు చేసుకున్నారు. 57 ఏళ్లకే పెన్షన్లు, రైతుబంధు చెక్కులు ఇంకా చాలాచోట్ల ప్రజలకు అందలేదు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు, హైదరాబాద్ లో రోడ్ల ప్రమాదాలు, డెంగీ జ్వరాలు, విత్తనాల కొరత, ఎరువుల కొరత, రెవెన్యూ శాఖలో తీవ్రమైన అవినీతి… ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలున్నాయి. ప్రతిపక్షాలు ఫోకస్ చెయ్యాల్సినవి ఇవి. భాజపాగానీ, కాంగ్రెస్ గానీ… ఇంకా కేసీఆర్ ట్రాప్ లో పడకుండా ఉంటూ, ప్రజల్లో ఉంటే కొంతైనా వారికీ రాజకీయంగా ప్లస్ అవుతుంది. లేదంటే… ఇదిగో ఇప్పుడు ఆర్టీసీ అంశంలో బిక్క మొహాలేసినట్టే, ప్రేక్షకపాత్రకు పరిమితం కావాల్సి వస్తుంటుంది.