బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ … యునైటెడ్ ఇండియా ర్యాలీ పేరుతో.. కోల్కతాలో బీజేపీ వ్యతిరేక భేరీ మోగిస్తున్నారు. ఈ ర్యాలీ కోసం తృణమూల్ కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది. కోల్కతా జన మయం కానుంది. ఈ సమావేశంలో దాదాపుగా.. బీజేపీయేతర పార్టీలన్నీ పాల్గొనబోతున్నాయి. చంద్రబాబునాయుడు నిన్న సాయంత్రమే కోల్కతా చేరుకున్నారు. విపక్షాల ఐక్యతకు ఈ ర్యాలీ కీలకం కానుంది. ఉదయం అంతా వివిధ పార్టీల నేతలతో చర్చలు జరపనున్నారు. ర్యాలీ ముగిసిన తరువాత చంద్రబాబు ఆధ్వర్యంలో విపక్ష పార్టీలన్నీ సమావేశం కాబోతున్నాయి. దేవెగౌడ, ఫరూక్ అబ్ధుల్లా, అఖిలేష్ యాదవ్, బిఎస్పీ ప్రధాన కార్యదర్శి సతీష్ మిశ్రా, స్టాలిన్, ప్రపుల్ల కుమార్ మహంత, అరుణాచల్ ప్రదేశ్ నేత గెగాంగ్ అపాంగ్ తదితరులు కాంగ్రెసేతర కూటమి సమావేశానికి హాజరవుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ తరపున మల్లిఖార్జున్ ఖర్గే బీజేపీయేతర పక్షాల కూటమి సమావేశానికి వస్తున్నారు. ఎన్నికలలోపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించాలని గతంలోనే నిర్ణయించారు. ఇందులో భాగంగానే కోల్కతా ర్యాలీని ఉపయోగించుకుంటున్నారు. ఎన్నికలకు ముందు భావసారూప్యత ఉన్న బిజెపీయేతర పక్షాలన్నీ కలసి సమావేశాలు నిర్వహించుకోవడం, అవకాశం ఉన్న రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకోవడం కూడా.. సమావేశ ఎజెండాలో ఒకటి. కోల్కతా ర్యాలీ తరువాత ఏపి రాజధాని అమరావతిలో మరో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ధర్మ పోరాట దీక్షలు అన్ని జిల్లాలలో ఇప్పటికే పూర్తి అవడం, రాజధాని పరిధిలోని గుంటూరు, కృష్ణా జిల్లాలకు కలిపి అమరావతిలో ధర్మపోరాట దీక్ష నిర్వహించాలని తెలుగుదేశం నిర్ణయించింది. ఎన్నికలు కూడా సమీపిస్తుండటంతో ధర్మ పోరాట దీక్ష అమరావతిలో నిర్వహించి, జాతీయ నేతలందరినీ ఆహ్వానించాలని టిడిపి నిర్ణయించింది. ఇందుకోసం నేతలందరి తేదీలను చూసుకుని అమరావతి ధర్మపోరాట దీక్షను ఖరారు చేయనున్నారు.
అమరావతి ధర్మ పోరాట దీక్ష అనంతరం ఎన్నికలలోపు ఇంకా మిగతా రాష్ట్రాలలో కూడా ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించేందుకు రూట్ మ్యాప్ ను ఖరారు చేయనున్నారు. ఎన్నికలకు ముందు ఆయా రాష్ట్రాలలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా బిజెపీయేతర పక్షాలు పొత్తులు పెట్టుకున్నప్పటికీ జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక వైఖరిని తీసుకోవాలని నిర్ణయించారు. లోక్ సభ ఎన్నికల తరువాత ఆయా పార్టీల బలాబలాల ఆధారంగా ప్రధాని మంత్రి అభ్యర్ధి ఎవరనేది అప్పుడు నిర్ణయించుకోవచ్చనేది కూడా బిజెపియేతర పక్షాల నేతలు భావిస్తున్నారు. తానే ప్రధానమంత్రి అభ్యర్థిని అంటున్న మమతా బెనర్జీ కూడా ఈ విషయంలో కాస్త వెనక్కి తగ్గారు. ప్రధానమంత్రి పదవిపై ఆమె సైలెంటయ్యారు.