తెలంగాణ అసెంబ్లీలో చాలా కాలం తర్వాత అనూహ్య సన్నివేశం కనిపించింది. సభలో హైడ్రామా కొనసాగింది. వాయిదా అనంతరం కూడా సభలోనే బైఠాయించిన ప్రతిపక్ష సభ్యులను పోలీసులు బలవంతంగా బయటకు పంపించాల్సి వచ్చింది. ఫీజు రీయింబర్స్ మెంట్ పై చర్చ తర్వాత ఈ పరిణామాలు జరిగాయి.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ అంశంపై ఇవాళ సభలో చర్చ జరిగింది. ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వ వైఖరిని విమర్శించారు. కాలేజీలకు ఫీజులు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని దుయ్యబట్టారు. అసలు ఈ పథకాన్ని అమలు చేస్తారా లేదా అని నిలదీశారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెడుతోందని ఆరోపించారు.
ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘంగా మాట్లాడారు. ఆ తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. దీంతో కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం సభ్యులు నిరసన తెలిపారు. సీఎం సరైన సమాధానం ఇవ్వలేదన్నారు. తాము వివరణ అడగటానికి అవకాశం ఇవ్వకుండా సభను వాయిదా వేశారని నిరసన తెలిపారు. సభలోనే బైఠాయించారు.
దీంతో అసెంబ్లీ కార్యద్శి సదారాం సీఎల్పీ నేత జానారెడ్డిని కలిశారు. నిరసన విరమించాలని కోరారు. అయినా జానారెడ్డి సహా ప్రతిపక్ష నేతలు ఒప్పుకోలేదు. అధికార పక్ష వైఖరికి నిరసనగా సభలోనే ఉంటామని తేల్చి చెప్పారు. దీంతో వారిని బలవంతంగా బయటకు పంపాలంటూ స్పీకర్ ఆదేశించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులను పోలీసులు బలప్రయోగంతో బయటకు పంపారు. కాంగ్రెస్ సభ్యులను గాంధీ భవన్ దగ్గర వదిలిపెట్టారు. టీడీపీ సభ్యులను ఎన్టీఆర్ భవన్ వద్ద వదిలేశారు.