చంద్రబాబు పాలనలో విపక్ష నేతలకు రక్షణ లేదా అన్న ప్రశ్న సోషల్ మీడియాలో చర్చించ బడుతోంది. ఇటీవల ప్రతిపక్ష నేత జగన్ పై ఏర్ పోర్టు లో జరిగిన దాడి, పవన్ కళ్యాణ్ కాన్వాయ్ లో జరిగిన ప్రమాదం, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ కు విచ్చేసిన అమిత్ షా మీద తిరుపతిలో జరిగిన రాళ్ల దాడి, నెల్లూరు లో బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మీద రాళ్లతో చేసిన దాడి – ఇవన్నీ ఉదహరిస్తూ చంద్రబాబు పాలనలో విపక్ష నేతలకు రక్షణ లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. దీనికి తోడు, అధికార పార్టీకి చెందిన నేతల మీద కానీ వారితో సంబంధం ఉన్న వ్యాపార వేత్తల మీద కానీ ఇన్కమ్ టాక్స్ రైడ్ జరిగినా కూడా డిబేట్ లు పెట్టి గగ్గోలు పెట్టే అగ్ర మీడియా విపక్ష నేతల మీద దాడులు జరిగి, వారి ప్రాణాల మీదకు వచ్చినా కూడా ఆ వార్తలను అండర్ ప్లే చేయడం చూసి ప్రజలు విస్తుపోతున్నారు.
ఇటీవల ప్రతిపక్ష నేత జగన్ పై విమానాశ్రయంలో దాడి జరిగింది. దాడి జరగడం ఒక ఎత్తు అయితే, ఆ దాడి జరిగిన తర్వాత ఇటు ప్రభుత్వం కాని అటు అగ్ర మీడియా కానీ ప్రవర్తించిన తీరు మరొక ఎత్తు. దాడి జరిగిన గంటలోపే పోలీసులు ఇది చేసింది జగన్ అభిమాని అని తేల్చి చెప్పడం, అగ్ర మీడియా గా చలామణి అవుతున్న అన్ని న్యూస్ ఛానల్స్ ఒకవైపు ఇది చేసింది జగన్ అభిమాని అంటూ బలంగా ప్రచారం చేస్తూనే, మరొకవైపు కోడి కత్తి అంటూ కథనాలు వ్రాశారు. మొత్తానికి ప్రభుత్వం, మీడియా ఇద్దరూ కలిసి ఈ పని చేసింది జగన్ అభిమానే అని, జగన్ మీద ఉన్న విపరీతమైన అభిమానం తోనే ఆయన ఈ దాడి చేశాడని, విజయవంతంగా ప్రజలని (కొంతమందిని అయినా) నమ్మించగలిగారు.
ఇక కొద్ది రోజుల క్రిందట పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కి ఒక ప్రమాదం జరిగింది. పవన్ కళ్యాణ్ కి ఏమీ కానప్పటికీ, ఆయన బౌన్సర్లు తీవ్రంగా గాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా పోరాట యాత్ర కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్, తన కాన్వాయ్ వెళ్తుండగా దారి మధ్యలో ఒక లారీ డ్రైవర్ వేగంగా రివర్స్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. అయితే ఈ సంఘటనని ప్రజలు మీడియా లో చూసి కంటే కూడా సోషల్ మీడియాలో చూసి తెలుసుకున్నారు. ఒకవేళ ఇది ప్రమాదం అయితే పరవాలేదు కానీ నిజంగా దీని వెనక ఏదైనా కుట్ర ఉందా అన్న ఆలోచనలు ఆ పార్టీ అభిమానుల లో మొదలయ్యాయి. పైగా సాక్షాత్తు జనసేనానే ఆ మధ్య ఒక మీటింగ్లో, తనమీద కుట్ర జరుగుతోందని, తనను చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పడంతో ఆ పార్టీ అభిమానులో ఒకింత ఆందోళన కూడా నెలకొంది.
రెండు మూడు రోజుల కిందట నాదెండ్ల మనోహర్ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ అయింది. కారు వెనుక నుండి వచ్చిన లారీ ఢీకొట్టడంతో కారు వెనుక భాగం పూర్తిగా దెబ్బతింది. దీంతో కారు డ్రైవర్ వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే నాదెండ్ల మనోహర్ ఇటీవలే జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఒక వేళ ఇది ప్రమాదవశాత్తు జరిగిందనే అనుకుందాం. చైనా లో జరిగే ప్రమాదాలు, ఉత్తర భారతదేశంలో మారుమూల జరిగే ప్రమాదాలు కనిపించే మన అగ్ర మీడియాకి, ఈ ప్రమాదం ఎందుకు కనిపించలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చాలా మంది ప్రజలు ఈ వార్తని సోషల్ మీడియాలో చూసి తెలుసుకున్నారు తప్పించి ప్రధాన మీడియాలో చూసి కాదు.
వీటికి తోడు గతంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తిరుపతికి వచ్చినప్పుడు ఆయన మీద రాళ్ల దాడి జరిగింది. ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న ఉద్దేశంతో ప్రజలే దాడి చేశారు అని మన మీడియా ప్రకటించినప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అన్న విషయం బహిరంగ రహస్యమే. అలాగే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పై కూడా నెల్లూరులో ఇలాంటి ఘటనే జరిగింది. తెలుగుదేశం కార్యకర్తలు బిజెపి కార్యకర్తల మధ్య ఇలాంటి గొడవలే జరిగాయి.
ఏది ఏమైనా విపక్ష నేతల మీద బాబు పాలనలో జరుగుతున్న దాడులు , ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కానీ ఇటు చూస్తే చంద్రబాబు ఏమో తనను కేంద్ర ప్రభుత్వ దాడుల నుంచి రక్షించాలని ప్రజలను కోరుతున్నారు. ఒకవైపు సిబిఐకి రాష్ట్రంలోకి ఫ్రీ పాస్ నిషేధించి, తన వైపు నుంచి అన్ని ఏర్పాట్లు చేసుకుని కూడా తనను రక్షించాలని ప్రజలకు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఏది ఏమైనా బాబు పాలనలో జరుగుతున్న ఈ దాడులు ప్రమాదాలు చర్చకు దారితీస్తున్నాయి. ప్రమాదాల వెనుక కూడా ఏదైనా కుట్ర ఉందేమో అన్న అనుమానాలు ప్రజల్లో బాబు పాలన మీద వ్యతిరేకత పెంచుతున్నాయి. విపక్ష నేతల మీద జరుగుతున్న దాడులు ప్రమాదాల విషయంలో అగ్ర మీడియా వ్యవహరిస్తున్న తీరును మాత్రం ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు.
– జురాన్ ( CriticZuran)