నరేంద్రమోడీ ప్రధానమంత్రి కావడానికి ముందు ఈ దేశం యావత్తూ ప్రజానీకం ఆయన మీద ఎన్ని ఆశలను పెంచుకున్నదో.. ఆయన ప్రధాని అయిన తర్వాత.. తన వ్యవహార సరళితో.. దేశ ప్రజల్లోని ఎందరి ఆశలను, విశ్వాసాలను మొగ్గలోనే తుంచేశారో అందరికీ తెలుసు. ప్రధానిగా కావడానికి ముందు ఆయన ప్రకటించిన ప్రాధాన్యాలు, అయిన తర్వాత.. ఆయన అనుసరిస్తున్న ప్రాధాన్యాలు పూర్తిగా మారిపోయాయి. అయినప్పటికీ కూడా.. ప్రసంగాలు, ఉపన్యాసాలు ఇచ్చే ప్రతిసందర్భంలోనూ ఓ అద్భుతమైన మాటల మహేంద్రజాలాన్ని ప్రదర్శిస్తూ వింటున్న వారిని ఆకట్టుకోవడం అనేది మోడీకి ఒక అలవాటుగా మారిపోయింది. ఈ తీరుతో ఆయన దేశవిదేశీ వేదికలపై బహిరంగ ప్రసంగం చేసే ప్రతి సందర్భంలో జనాన్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు.
అయితే శోచనీయమైన విషయం ఏంటంటే.. ప్రధాని నరేంద్రమోడీ ఇదే తరహా మాటలగారడీతో ప్రతిపక్షాలను కూడా బురిడీ కొట్టించవచ్చునని అనుకుంటూ ఉండడం. ఏదో మాయ మాటలు చెబితే ప్రతిపక్షాలు కూడా బుట్టలో పడిపోతాయని అనుకోవడం.
ఇలాంటి అభిప్రాయం ఎందుకు కలుగుతున్నదంటే.. పార్లమెంటు బడ్జెటు సమావేశాలు మొదలు కాబోతున్న నేపథ్యంలో పార్లమెంటులోని అన్ని రాజకీయ పక్షాలతో మోడీ ఒక సమావేశం నిర్వహించారు. సభ సజావుగా జరగడానికి సంబంధించి అందరూ సహకరించాలని, బిల్లులన్నీ సభ ఆమోదం పొందేలా చూడాలని కోరడానికి ఉద్దేశించిన సమావేశం ఇది. ప్రతిపక్షాలు తమ అభ్యంతరాలతో అడ్డు పడకుండా విజ్ఞప్తి అన్నమాట. ఈ సమావేశంలో తాను భాజపాకు ప్రధాని కాదని, ఈ దేశానికి ప్రధానిని అని అంటూ ప్రతిపక్షాల అభ్యంతరాలన్నీ పట్టించుకుంటాం అని వారిని నమ్మించే ప్రయత్నం చేశారు.
ప్రధాని తనను తాను ఒక పార్టీకి పరిమితం చేసుకోకుండా, అందరికీ ప్రతినిధిని అన్నట్లుగా దేశప్రధానిగా అభివర్ణించుకున్న మాటలు చాలా తీయగానే ఉన్నాయి. కానీ.. ఆయన ఈ మాటలను ఒక కేబినెట్ భేటీకి ముందు ప్రకటించి, ప్రతిపక్షాల అభిప్రాయాలను ఆహ్వానించి ఉంటే… చాలా హీరోచితంగా ఉండేది. అలా కాకుండా, ఇప్పుడు పార్లమెంటులో తమ బండారం బజార్న పడకుండా బతిమాలడానికి ఇలా పార్లమెంటు కు ముందుకాదు ఈ మాటలు చెప్పవలసినది. పార్లమెంటు సమావేశాలకు ముందు నేను మీ అందరికీ కూడా ప్రధానిని అని విపక్షాలకు చెబితే అది వారిని బురిడీ కొట్టించడానికే, అదే కేబినెట్‌కు ముందు చెబితే.. వారి అభిప్రాయాలకు కూడా విలువ ఇచ్చినట్లు అవుతుంది.
కాబట్టి మోడీ.. ఇలాంటి గారడీలు మాని.. నిర్దిష్ట కార్యచరణతో విపక్షాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, అర్హమైన వాటికి అనుగుణంగా బిల్లులను సరిదిద్దుకోవడంలో భేషజాలకు పోకుండా ఉండాలని పలువురు కోరుతున్నారు.