“నయా భారత్” పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ పెట్టబోతున్నారన్న లీక్‌తో… తెలంగాణ రాజకీయాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ అంశంపై టీఆర్ఎస్ నేతలెవరూ నోరు మెదపలేదు. కానీ..విపక్ష నేతలు మాత్రం.. తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం ప్రారంభించారు. కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేయడం ప్రారంభించారు. ఇటీవలి కాలంలో..కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని విరుచుకుపడుతున్న జగ్గారెడ్డి… కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే నవ్వుల పాలవుతారని తేల్చేశారు. గడప దాటకుండా 4 గోడల మధ్య కూర్చుంటే జాతీయ పార్టీ నడవదని చెప్పుకొచ్చారు. ప్రధాని పదవిని ఆశించిన మాయావతి, శరద్ పవార్‌కే సాధ్యంకాలేదన్నారు. కేసీఆర్ వెంట ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా కలిసిరావన్నారు.
జగ్గారెడ్డి తరహాలోనే తెలంగాణ జన సమితి నేత కోదండరాం స్పందించారు. దేశంలో కొత్త పార్టీకి అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేసిన కోదండరాం.. కేసీఆర్ జాతీయ రాజకీయాలకు పనికిరారని స్పష్టం చేశారు. ఎందుకంటే.. కేసీఆర్ జాతీయ పార్టీని ఇతర ప్రాంతీయ పార్టీలు స్వాగతించబోవని అంటున్నారు. అంత వరకూ ఎందుకు కేసీఆర్ జాతీయ పార్టీని తన ఫ్రెండ్ జగనే మొదట అంగీకరించరని తేల్చేశారు. మిగతా నేతలదీ అదే అభిప్రాయం. అయితే.. ఈ అంశంపై ప్రధాన నేతలందరూ గుంభనంగానే ఉంటున్నారు. కేసీఆర్ అధికారిక ప్రకటన చేయలేదు కాబట్టి.. మీడియా ప్రచారమే కాబట్టి.. స్పందించడం తొందరపాటు అవుతుందని అనుకుంటున్నారు.
కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలంటే ముందుగా…తెలంగాణలో నాయకత్వాన్ని కేటీఆర్‌కు అప్పగించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే.. జాతీయ రాజకీయాలపై కీలకమైన ప్రకటన కేసీఆర్ చేయడానికి అవకాశం ఉంది. నిజానికి కేటీఆర్ పట్టాభిషేకం అనేది.. గత ఎన్నికల ముందు నుంచీ నడుస్తున్న ప్రచారం. ఆ పరిణామం ఎప్పుడు జరుగుతుదో.. కేసీఆర్ జాతీయ రాజకీయాలకు ఎప్పుడు వెళ్తారో అంచనా వేయడం కష్టం. అయితే.. కేసీఆర్ తెలంగాణ సాధించిన విధానాన్ని చూసిన వారెవరూ… ఆయన జాతీయ రాజకీయ ప్రయత్నాలను తక్కువ అంచనా వేయలేరు.