ఇప్పుడు ఎన్నికలు జరిగితే 111 స్థానాలు వచ్చేస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి ఒక సర్వేలో తేలినట్టు వచ్చిన వార్తలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి. మాకే 70 వస్తాయని కాంగ్రెస్ ఎదురుదాడి చేసింది. తమకు ఒక్కటంటే ఒక్కటైనా రాదనడం పట్ల బిజెపి చిందులు తొక్కుతున్నది. టిడిపి ఆ సర్వేనే శంకించింది. కొంతమంది కాంగ్రెస్ నాయకులైతే మీడియా ఈ సర్వేకు అనవసర ప్రాధాన్యత నిస్తూ కెసిఆర్‌కు మేలు చేస్తున్నదని ఆరోపించారు. ఇంతకూ దీనిపై ఒక టిఆర్ఎస్ ముఖ్య నాయకుడు ఏమన్నాడంటే ఈ సర్వే తమ అంతర్గత వ్యూహాల కోసం చేయించందన్నారు. గత సారి కెసిఆర్ ఒకసారి ఎమ్మెల్యే పనితీరు బాగాలేదని ఫలితాలు విడుదల చేశారు. దాంతో వారిపై ఒత్తిడి పెరిగింది. స్వంత పార్టీ సర్వేలోనే తమను తీసిపారేస్తే రేపు ప్రజలు ఎలా ఓటేస్తారని వారంతా గగ్గోలు పెట్టారట. దాంతో నష్టనివారణ కోసం ముఖ్యమంత్రి మరో సర్వే ప్రహసనం జరిపించారు. అందరూ బాగా పనిచేస్తున్నట్టు నివేదికలు తెప్పించి మీకే టికెట్టు ఇస్తామంటూ వెళ్లిపనిచేసుకోమన్నారు. పనిలో పనిగా ప్రతిపక్షాలపై దాడికి వాడుకున్నారు. అంతేగాని ఈ సర్వేను ఆయనే తీవ్రంగా తీసుకోలేదు.కాని మీడియాలో వచ్చాక ప్రతిపక్షాలు స్పందించాక దాని విలువ పెరిగింది ఆని ఆ నాయకుడు వివరించారు.