ఈనెల 21న విపక్షాలన్నీ ఢిల్లీలో సమావేశం పెట్టాలని భావించాయి. ఎన్నికల ఫలితాలకు రెండు రోజులు ముందు జరిగే ఈ సమావేశం కీలకమైన రాజకీయ పరిణామంగా మారే అవకాశం ఉంది. అయితే, ఆ రోజున ఈ సమావేశం ఉంటుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు, మమతా బెనర్జీతో ఇదే అంశమై చర్చించిన సంగతి తెలిసిందే. అంతకుముందు, ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసి కూడా… ఈ సమావేశంపైనే ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. ఫలితాలకు ముందే విపక్షాలన్నింటినీ ఒక వేదిక మీదికి తీసుకొస్తే బాగుండు అనేది చంద్రబాబు ప్రతిపాదన. అయితే, ఫలితాలు వచ్చాకనే ఈ సమావేశం ఉంటే మంచిది అనేది మమతా బెనర్జీ అభిప్రాయంగా తెలుస్తోంది.
ఇదే విషయమై ఏపీ సీఎం చంద్రబాబుతో ఆమె చర్చించారనీ, ఫలితాల ముందుగానే సమావేశం అంటే కొన్ని పార్టీలు గైర్హాజరు అయ్యే అవకాశం ఉందనీ, ఎన్నికల ఫలితాలు వచ్చేస్తే పరిస్థితులు చాలా స్పష్టంగా అన్ని పార్టీలకూ అర్థమైపోతుందనీ, అప్పుడు సమావేశం పెట్టుకుంటే బాగుంటుందని మమతా అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై ఉండే సాధ్యాసాధ్యాలను కూడా అప్పుడు చర్చించుకునే అవకాశం ఉంటుంది కదా అనేది దీదీ అభిప్రాయం. మమతా అభిప్రాయంలో కొంత వాస్తవం కూడా ఉండటంతో చంద్రబాబు కూడా దీనిపై ఆలోచిస్తున్నారట. దీంతో ఈ నెల 21న జరగాలనుకున్న సమావేశం వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వాస్తవానికి ఈ సమావేశం ముందుగానే జరగాల్సిన అవసరం కనిపిస్తోంది! ఎందుకంటే, ఎన్నికల ఫలితాలకంటే ముందుగానే కొన్ని పార్టీలు గ్రూపుగా ఏర్పడి, కూటమి కట్టామని రాష్ట్రపతికి చెప్పాలి. ఎన్నికల ఫలితాల తరువాత.. ఏ పార్టీకీ సొంతంగా మెజారిటీ రాని పరిస్థితి ఏర్పడితే… ప్రీపోల్ అలయెన్స్ లో ఉన్న కూటమికి ఎక్కువ స్థానాలు ఉన్నట్టయితే, ఆ కూటమిని ముందుగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశం ఉంటుంది. భాజపాకి ఎలాగూ సొంతంగా పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో, ఆ పార్టీ కూడా భాగస్వామ్య పక్షాల సంఖ్యను పెంచుకునేందుకే ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో, ఫలితాలు ముందుగానే ఒక వేదిక మీదికి విపక్షాలు వచ్చేస్తే మంచిది అనేది చంద్రబాబు ఆలోచనగా చెప్పుకోవచ్చు. 21న జరగాల్సిన సమావేశం జరిగితేనే మంచిదనే అభిప్రాయం విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.