నరేంద్ర మోడీ గతేడాది దేశ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టినప్పటి నుండి ‘మన్ కి బాత్’ (మనసులో మాట) పేరిట ఒక రేడియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో దేశాభివృద్ది కోసం తన ప్రభుత్వం చేస్తున్న కృషి, ప్రతిపక్షాలపై విసుర్లు, వర్తమాన రాజకీయాల గురించి మాట్లాడుతుంటారు. ఆ క్రార్యక్రమంలో ఆయన ప్రజలు అడిగే ప్రశ్నలకు జవాబులు చెపుతుంటారు. మళ్ళీ ఆదివారంనాడు మన్ కి బాత్ రేడియో క్రార్యక్రమం ప్రసారం అవుతుంది.
వచ్చేనెల బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున ప్రధాని మోడీ మన్ కి బాత్ కార్యక్రమం నిర్వహించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేసినట్లవుతుంది కనుక ఆ కార్యక్రమానికి అనుమతి మంజూరు చేయవద్దని ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసాయి. మన్ కి బాత్ పేరిట ఆయన బీహార్ ప్రజలను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తారని వారు ఆరోపిస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం వారి భయాలకు వేరేగా నిర్వచించింది. బీహార్ ఎన్నికలలో బీజేపీని ఒంటరిగా ఎదుర్కొనే దైర్యం లేకనే ఆరు పార్టీలు కలిసి జనతా పరివార్ కూటమిని ఏర్పాటు చేసుకొన్నాయని, కాంగ్రెస్ పార్టీ కూడా వాటితో జత కట్టిందని, అయినా కూడా వాటికి బీజేపీని ఎదుర్కొని బీహార్ ఎన్నికలలో గెలుస్తామనే నమ్మకం లేదని అందుకే చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో నుంచి చూస్తూ ఉలికులికి పడుతున్నాయని ఎద్దేవా చేసింది.
ప్రతిపక్షాలు చేసిన విజ్ఞప్తిని ఎన్నికల కమీషన్ త్రోసి పుచ్చింది. కానీ మన్ కి బాత్ కార్యక్రమంలో ఒకవేళ మోడీ ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించినట్లయితే బీజేపీపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చింది. కానీ అధికార పార్టీల మీద ఎన్నికల కమీషన్ చర్యలు తీసుకోవడం అంటే నేతి బీర కాయలో నెయ్యి ఉన్నట్లు భ్రమ పడినట్లే ఉంటుంది.