మునుగోడు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్తో వద్దని తమతో రావాలని కాంగ్రెస్ పార్టీ నేతలు విజ్ఞప్తి చేస్తే.. మీకుబీజేపీని ఓడించేంత శక్తి లేదని.. అది కేసీఆర్ కే ఉందని కమ్యూనిస్టు నేతలు నేరుగానే అన్నారు. దశాబ్దాలుగా రాజకీయంలో ఉన్న వారికి కేసీఆర్ అంత నమ్మకం కలిగించారు. మునుగోడులో కేసీఆర్ కే మద్దతు ప్రకటించారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కేసీఆర్ ముఖం మీదనే తలుపులు మూసేయడంతో వారు కాంగ్రెస్ వద్దకు వెళ్లారు.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ తో వామపక్షాల నేతలు భేటీ అయ్యారు . తమకు మూడు సీట్లు ఇస్తే పొత్తులు పెట్టుకుంటామని సీపీఐ నేతలు చెప్పారు. హుస్నాబాద్ , ఇల్లెందుతో పాటు ఖమ్మంలో ఒక సీటు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే .. కాంగ్రెస్ ఇంచార్జ్ ఏం చెప్పారో తెలియదు… కానీ పొత్తులకు రెడీ అని కాంగ్రెస్ దగ్గరకు వామపక్షాలు వెళ్లడమే కీలకం. కాంగ్రెస్ పార్టీ కూడా కలసి వచ్చే వారిని కలుపుకుని వెళ్లాలనుకుంటోంది. జాతీయ స్థాయిలో కమ్యూనిస్టులు ఇండియా కూటమిలో భాగంంగా ఉన్నారు. అందుకే వారడిగిన ఒకటి, రెండు సీట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.
మరో వైపు కోదండరాం కూడా.. పొత్తుల సంగతి తేల్చాలని అంటున్నారు. ఆయన కూడా ఓ స్థానం కేటాయించే అంశంపై కాంగ్రెస్ లో చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ మరింత బలహీనపడితే.. మొత్తంగా కేసీఆర్ వర్సెస్ కాంగ్రెస్ పక్షాలు అన్నట్లుగా సీన్ మారిపోతుందని అదే జరిగితే కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ అవుతుందన్న వాదన వినిపిస్తోంది.