తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు త్వరలో ఉంటాయి. శక్తులన్నీ కూడదీసుకుని ప్రతిపక్ష పార్టీలన్నీ మళ్లీ మరోసారి అధికార తెరాసతో బలంగా తలపడాల్సి ఉంటుంది. అయితే, ఈ విపక్ష పార్టీల్లో వామపక్షాలకు మున్సిపల్ ఎన్నికలు పెద్ద సవాలుగా మారబోతున్నాయి. తెలంగాణలో గట్టి పట్టు నిలుపుకుంటూ వచ్చే వామపక్షాలు.. ఈ మధ్య వరుసగా చతికిలపడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలు మొదలుకొని, ఇటీవలి హుజూర్ నగర్ ఉప ఎన్నిక వరకూ ఎక్కడా సత్తా చాటలేకపోయాయి. దీంతో, ఉభయ పార్టీల జాతీయ నాయకత్వాలు తెలంగాణపై దృష్టి పెట్టినట్టు సమాచారం.
రాష్ట్రంలో ఇంతగా బలహీనపడటానికి కారణం ఏంటనే అధ్యయనంలో జాతీయ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రస్థాయిలో సరైన నాయకత్వం లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి కారణమని అంటున్నారట! సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం… ఈ ఇద్దరి పనితీరుపై చర్చ జరుగుతోందని సమాచారం. ఈ ఇద్దరికీ కేంద్ర నాయకత్వం దగ్గర ఉన్న గుర్తింపు కారణంగా ఇంకా కొనసాగుతున్నారుగానీ, స్థానికంగా వామపక్షాలను బలంగా నడిపించడంలో, ఉద్యమాలు నిర్మించడంలో పూర్తిగా విఫలమౌతున్నారనే అభిప్రాయం జాతీయ నాయకత్వానికి ఉందని తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ పార్టీల కూటమి తరఫున సీపీఎం, కాంగ్రెస్ టీడీపీ టీజేయస్ లతో కలిసి సీపీఐ ఎన్నికల బరిలోకి దిగాయి. కానీ, ఎక్కడా ప్రభావితం చూపలేకపోయాయి. దీంతో, ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి దిగుదామా, దిగితే ఎలా అనే చర్చ రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న సమయంలో…. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మంచి ఫలితాలు రాబట్టి తీరాలంటూ చాడా వెంకటరెడ్డికీ, తమ్మినేని వీరభద్రానికీ ఆయా పార్టీలు పైనుంచి నుంచి టార్గెట్లు పెట్టినట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా పనితీరు మారకపోతే… రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల్ని మార్చే అంశమై కూడా ఆలోచించాల్సి ఉంటుందని సున్నితంగా హెచ్చరించినట్టు సమాచారం. దీంతో, ఇప్పుడు ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడిందని అనిపిస్తోంది. వాస్తవానికి, కాలానుగుణంగా పార్టీ విధివిధానాలూ తీరుతెన్నులు మార్చుకోవడంలో కమ్యూనిష్టులు విఫలమౌతున్నారు. ఇదొక్క తెలంగాణకే పరిమితమైన అంశం కాదు.. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో అదే పరిస్థితి. ప్రక్షాళన మొదలవాల్సింది జాతీయ స్థాయి నుంచి!