తెలంగాణాలో కాంగ్రెస్, తెదేపా, బీజేపీ, వామపక్షాలు ఇవాళ్ళ రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చాయి. 15 నెలలు గడిచినా ఇంతవరకు పంట రుణాలను మాఫీ చేయకపోవడంతో తెలంగాణాలో ఆర్ధిక సమస్యలలో చిక్కుకొని ఆత్మహత్యలు చేసుకొంటున్నారు కనుక ఇకనయినా ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా పంట రుణాలన్నిటినీ ఒకేసారి మాఫీ చేయమని తెరాస ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అందుకోసం రూ.8,500 కోట్లు విడుదల చేయమని ప్రభుత్వాన్ని కోరాయి. కానీ ఒకేసారి అంత మొత్తం విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇవాళ్ళ రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చాయి. శాసనసభ నుంచి ప్రతిపక్షాలను సస్పెండ్ చేసిన వెంటనే రాష్ట్ర బంద్ చేయబోతున్నట్లు ప్రకటించి అన్ని పార్టీల నేతలు జిల్లా పర్యటనలు చేస్తూ ప్రజలను కలిసి ప్రభుత్వ తీరు గురించి వివరిస్తున్నారు. కనుక బంద్ కోసం అన్ని పార్టీలు ముందు నుంచే పూర్తి సమాయత్తం అయ్యాయి. ఇవాళ్ళ తెల్లవారు జాము నుంచే ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు బస్సు డిపోల వద్దకు చేరుకొని బస్సులను బయటకి రానీయకుండా అడ్డుకొంటున్నారు.
ప్రతిపక్షాలు బంద్ కి పిలుపునీయడంపై మంత్రి కేటిఆర్ స్పందిస్తూ ఇన్ని దశాబ్దాలుగా తెలంగాణాని దోచుకుతిని రైతులకు ఈ గతి పట్టించినవాళ్ళే ఇప్పుడు రైతుల కోసం మొసలి కన్నీళ్ళు కార్చుతూ రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేసారు. తమ పార్టీ అధికారం చేపట్టి కేవలం 15 నెలలు మాత్రమే అయినపటికీ రైతుల పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి అనేక చర్యలు చేపట్టిందని వాటి ఫలితాలు క్రమంగా కనబడతాయని అన్నారు. కనుక ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మి బంద్ కు సహకరించవద్దని ఆయన ప్రజలను కోరారు.