ఎన్నికల ఫలితాల కంటే.. ముందే.. బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఏకం చేయాలనుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు పరిస్థితులు కలసి రావడం లేదు. అసలు రిజల్ట్ ఏమిటో తెలియకుండా హడావుడి ఎందుకున్న చందంగా ప్రాంతీయ పార్టీల నేతలు ఉన్నారు. చివరి విడత పోలింగ్ ముగిసిన రెండు రోజులకు.. అంటే 21న ముందు భేటీ కావాలనుకున్నారు. ఇప్పుడది కౌంటింగ్ రోజుకు మారింది.
కౌంటింగ్ రోజు బీజేపీయేతర పార్టీల భేటీ సాధ్యమేనా..?
దేశప్రజల తీర్పు వెల్లడి కానున్న మే 23వ తేదీన … ఢిల్లీలో … బీజేపీయేతర పార్టీల కూటమి భేటీ అయ్యేలా.. చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఈ మేరకు.. మమతా బెనర్జీ సహా కొంత మంది నేతలతో చర్చలు జరిపారు. మామూలుగా అయితే..ఫలితాలకు రెండు రోజుల ముందే పెట్టాలని అనుకున్నారు కానీ..రాజకీయ పార్టీల అధినేతలందరూ కౌంటింగ్‌కు .. పార్టీ నేతలను సన్నద్ధం చేయడంతో పాటు.. ఇతర పార్టీ పరమైన అంశాల్లో బిజీగా ఉండే అవకాశం ఉండటంతో.. ఫలితాల రోజే.. సమావేశాన్ని నిర్వహించాలని అనుకుంటున్నారు. దేశవ్యాప్త ట్రెండ్స్.. ఉదయం పదకొండు గంటల కల్లా తేలిపోతాయి. దాన్ని బట్టి…వెంటనే కార్యాచరణ సిద్దం చేుసకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.
బీజేపీయేతర పార్టీలకే ఎక్కువ ఎంపీ సీట్లు ఉంటే ప్రయోజనం ఏమిటి..?
బీజేపీకి పూర్తి స్థాయి అధికారం రాకుండా… ప్రాంతీయ పార్టీలు వ్యూహం రూపొందించుకోవడంలో విఫలం అయితే.. .. మోదీ, షాలు తమ మార్క్ రాజకీయాలను ప్రారంభిస్తారని ..చంద్రబాబు అనుమానిస్తున్నారు. ఫలితాలు వచ్చిన వెంటనే… మోదీ, షాలకు ఎలాంటి చాన్స్ ఇవ్వకుండా… సమావేశం అయి.. తామంతా ఓ కూటమి భావన వచ్చేలా చేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్డీఏ కూటమికి ఎలా చూసినా..రెండు వందల కన్నా తక్కువ సీట్లే వస్తాయి కాబట్టి… తమ కూటమి తరపున అత్యధిక మంది ఎంపీలు కనిపిస్తారని..చంద్రబాబు భావిస్తున్నారు. రాహుల్ గాంధీతోనూ..చంద్రబాబు ఈ సమావేశంపై చర్చించారు.
బీజేపీ ఊహించిన దానికన్నా ఎక్కువ సీట్లొస్తే కూటమి లేనట్లే..!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు పూర్తి ధీమాగా ఉన్నారు. పద్దెనిమిది పార్లమెంట్ స్థానాలు వస్తాయని.. ఇప్పటికే.. అంతర్గత నివేదికల్లో తేల్చారు. పాజిటివ్ వేవ్ ఎక్కువగా ఉంటే.. ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయనే అంచనా ఉంది. ఈ క్రమంలో ఏపీలో ఫలితాలపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన పని లేదనుకుంటున్న చంద్రబాబు.. పూర్తిగా.. జాతీయ రాజకీయాలపైనే దృష్టి పెట్టారు. అయితే… కౌంటింగ్‌లో.. హంగ్ వస్తే తప్ప… ఈ భేటీ జరగడానికి అవకాశం లేదని.. తాజా పరిమాణామాలతో తేలిపోతుంది. బీజేపీ ఏ మాత్రం అధికారానికి దగ్గరగా వచ్చినా.. ఇప్పుడు… బీజేపీకి వ్యతిరేకంగా పోరాడిన పార్టీలు.. సైలెంటయ్యే అవకాశమో లేకపోతే… బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నమో చేసే అవకాశం ఉందన్న అంచనాలు ఎలాగూ ఉన్నాయి.