ఈవీఎం విధానంలో ఎన్నికలు నిర్వహించొద్దు అంటూ మెజారిటీ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం ముందు మొరపెట్టుకున్నాయి! 2019 ఎన్నికల్ని బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని కోరాయి. ఢిల్లీలో జరిగిన ఈసీ భేటీలో మెజారిటీ పార్టీలు ఇవే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే… ఈవీఎం విధానాన్ని మార్చాలంటూ ఏపీ అధికార పార్టీ టీడీపీ పట్టుబట్టింది. అయితే, తెరాస దీన్ని తీవ్రంగా ఖండించింది. ఈవీఎంలను అనుమానించాల్సిన అవసరం లేదనీ, అధికార పార్టీకి మాత్రమే అనుకూలంగా ఓట్లు పడతాయన్నది కేవలం అనుమానం మాత్రమేనంటూ తెరాస ఎంపీలు కొట్టిపారేశారు. నిజానికి, ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఇతర పార్టీల కంటే తెరాస ప్రతినిధులే కాస్త గట్టిగా మాట్లాడారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే… ఈవీఎంల విషయమై భాజపా విధానంతో తెరాస పూర్తిగా ఏకీభవించడం. వైకాపా ఈ భేటీకి హాజరు కాలేదు.
ఈవీఎంలతో అనుసంధానించే వీవీప్యాట్ల పనితీరుపై కూడా పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఓటరు జాబితాలను ఆధార్ నంబర్లతో అనుసంధానం చెయ్యాలనీ, తద్వారా నకిలీ ఓట్లను నియంత్రించొచ్చని సూచించాయి. మళ్లీ బ్యాలెట్ విధానంలోనే ఎన్నిలు నిర్వహించాలనే పార్టీల డిమాండ్ పై సీఈసీ ఓపీ రావత్ మరోలా స్పందించారు. ఈ విధానం వల్ల ఇబ్బందులున్నాయనీ, సమస్యలు వస్తాయన్నారు. బూత్ అక్రమణల్ని మరోసారి ప్రోత్సహించినట్టే అవుతుందన్నారు. ఈవీఎంలు, వాటికి అనుసంధానించిన వీవీ ప్యాట్లలో కొన్ని సమస్యలున్నట్టు తమ దృష్టికీ వచ్చిందని ఆయన అంగీకరించారు. వీటిపై దృష్టి పెడతామని రావత్ స్పష్టం చేశారు.
నిజానికి, ఓటింగ్ ప్రక్రియ ఈవీఎంలు వచ్చాక సులభతరం అయింది. ఓట్ల లెక్కింపు చాలా సులువైంది. సాంకేతికంగా చూసుకున్నా కూడా ఈవీఎంలు వైఫల్యమైన రేటు 0.7 శాతం మాత్రమే ఉంటోందని లెక్కలున్నాయి. కానీ, మెజారిటీ రాజకీయ పార్టీలు ఈ విధానంలో ఎన్నికల నిర్వహణపై పూర్తిగా నమ్మకం కోల్పోవడం విశేషం..! అధికార పార్టీలకు అనుకూలంగా ఓట్లు పడుతున్నాయంటూ కాంగ్రెస్ తోపాటు మాయావతి, అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా గతంలో ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల తరువాత ఈ అనుమానాలు మరిన్ని పార్టీలకూ వచ్చాయి. ఇప్పుడు ఎన్నికల సంఘం ముందు పెద్ద సమస్యే ఉన్నట్టు లెక్క. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల నిర్వహణలో భాగమైన ఈవీఎం విధానంపై మెజారిటీ రాజకీయ పార్టీలకే నమ్మకం లేకుండా పోయిందంటే చిన్న విషయం కాదు! దాదాపు 70 శాతం పార్టీలు బ్యాలెట్ విధానానికే మళ్లీ వెళ్దామని అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.