జిహెచ్ఎంసి ఎన్నికల పోరాట సారథిగా అధికార పక్షం తరపున రంగంలో దిగిన కుమార మంత్రి కెటిఆర్ సవాళ్ల పర్వాన్ని రోడ్ షోలోనూ కొనసాగిస్తున్నారు. ఇంతకూ ఈ సవాళ్ల సమరంలో పెద్ద పసలేదని కాస్త పరిశీలిస్తే అర్థమైపోతుంది. కోటి మంది జీవించే మహానగర ఎన్నికలలో సమస్యలపై గాక సవాళ్లు ప్రతిసవాళ్లపై చర్చ పనిలేని పని. కాని పార్టీల నేతలూ, మీడియా సంస్థలూ కూడా దాని చుట్టే తిరుగుతున్నాయి కాబట్టి ఒకసారి సూటిగా వాటి సత్యాసత్యాలు తేల్చేసుకోవడం మంచిది.
వంద సీట్లు గెలవడం, మేయర్ పీఠం కైవశం గురించి మాట్లాడుతూ కెటిఆర్ అలా జరక్కపోతే రాజీనామా చేస్తానన్నారు. ఆ రోజు నమస్తే తెలంగాణ ప్రధాన శీర్షికల్లో వంద సీట్ల మాట తప్ప రాజీనామా సవాలు ప్రముఖంగా ఇవ్వకపోవడంలోనే టిఆర్ఎస్ సర్దుబాటు అర్థమైంది. కాని ప్రతిపక్షాలు మాత్రం పదే పదే వంద సీట్లు రాకపోతే వైదొలుగుతావా…అంటూ రెట్టించినప్పటికీ ఆయన గాని ఆ పార్టీగాని అందుకు ప్రతిస్పందించలేదు. మేయర్ పీఠం మాదే అన్న మాట వరకే పునరుద్ఘాటించారు. మా చర్చలలో పదే పదే ఈ ప్రస్తావన వస్తున్నా 100-120 అంటున్నారే గాని రోషానికి పోయి సవాలు ఒప్పేసుకోవడం లేదు.
ఈ రోజు రోడ్‌షో ప్రారంభించిన కెటిఆర్ కూడా మేయర్ పీఠం గురించి చెప్పడం తప్ప 100 ముచ్చటతో ముడిపెట్టలేదు. అంటే వంద వస్తాయని గట్టిగా నమ్మడం లేదన్నమాట. అదే చెబితే ముందే పలచనై పోతామన్న భయంకూడా ఉండొచ్చు. 80 వరకూ వస్తాయన్నది కెటిఆర్ చెప్పిన మొదటి లెక్క. తర్వాత వందకు పెరిగింది. ఆ సంఖ్యతో సంబంధం లేకుంటే సవాలుకు పసలేనట్టే. ఎందుకంటే మరీ గత్యంతరం లేకపోతే మజ్లిస్ సహాయంతో ఎలాగూ మేయరవుతారు.
రెండు సీట్లను తెచ్చుకున్న గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు టిఆర్ఎస్ బలం పెంచుకున్నదనేది నిజం. ఆ మేరకు కార్పొరేట్లో డివిజన్లు కూడా బాగా పెరుగుతాయి. కాని క్షేత్ర స్థాయిలో యాంత్రాంగం ఇప్పటికీ సక్రమంగా లేదు. వారి నామినేషన్ల తిరస్కరణ, తిరుగుబాటుదార్లకు బుజ్జగింపులు వంటివాటిని బట్టి స్థానికంగా టిఆర్ఎస్ ఏమంత పటిష్టం కాలేదని తెలుస్తుంది. అధికారంతో పాటు గతంలో నగరంలో ఉన్న వ్యతిరేకత తగ్గించుకోవడం టిఆర్ఎస్ తొలివిజయం. ఆ మేరకు ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయనేది స్పష్టం. ఎన్నికల ప్రకటన ముందు చట్టపరంగా తీసుకున్న లోపాయికారి చర్యలకు తోడు పెరిగిన పట్టు ఇందుకు కారణమవుతుంది. అయినా వంద సీట్ల సవాలును స్వీకరించడానికి సిద్ధం కాలేదంటే పాలకపక్షాన్ని ఇంకా జంకు విడవలేదని తెలిసిపోతుంది.
తెలుగుదేశం నాయకులు ఈ సవాలుకు కట్టుబడివున్నారా… అని పదే పదే రెట్టించారు. కాని తమ సంగతేమిటో తమ సవాళ్లు ఏమిటో చెప్పలేకపోతున్నారు. సాక్షాత్తూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రారంభ ప్రసంగంలో తాము కింగ్ మేకర్స్‌గా ఉంటామన్నారే గాని కింగ్స్‌గా ఉంటామని చెప్పలేకపోయారు. అంటే ఆధిక్యత వస్తుందని చెప్పడానికి కూడా సిద్ధంగా లేరన్నమాట. తమ వైపునుంచి విశ్వాసంతో చెప్పకుండా అవతలివారి సవాళ్లను తమ సవాళ్లుగా మార్చుకోవాలన్న ఆలోచన పెద్దగా పనిచేయదు. మాకు ఇన్ని వస్తాయి..మీకు రాకపోతే ఇలా చేస్తారా… అంటే అప్పుడది ప్రతిసవాలు. అది లేకుండా అవతలి వారి సవాలును మళ్లీ మళ్లీ గుర్తు చేయడం వారికే మంచిదవుతుంది. ఆ పార్టీ మెతకవైఖరి గురించి వచ్చిన సమాచారాలకు ‘కింగ్ మేకర్ కామెంట్’ అనుగుణంగానే వుంది. గతంలోనే నగర టిడిపి గురించి చెప్పుకున్న విషయాలను కృష్ణయాదవ్ రాజీనామా నిరూపించింది. ఇలాటి అసంతృప్తి దేవేందర్ గౌడ్ శిబిరంలోనూ ఉంది. కనుక టిడిపి అలోచనలకే పరిమితి ఉంది.
ఇక బిజెపి పరిస్థితి ఇంకా దారుణం. టిడిపి కన్నా ముందే వారు రంగంలోకి దిగారు. రాజకీయంగా మాట్లాడారు. కాని కూటమి నాయకత్వం టిడిపిది గనక మింగలేక కక్కలేక అన్నట్టు ఉండిపోతున్నారు. స్నేహపూర్వక పోటీ చేస్తున్న 12 స్థానాలు టిఆర్ఎస్కు ధారదత్తం చేసినట్టేనని బిజెపి నేత ఒకరన్నారు. టిడిపిని వదిలించుకోవడానికైనా ఈ ఎన్నికల ఓటమి ఉపయోగపడాలని వారిలో చాలామంది కోరుకుంటున్నారు. ఆ పార్టీ ఎంఎల్ఎ రాజాసింగ్ విమర్శలు సంధిస్తూనే ఉండగా మాజీలు కొందరు టిఆర్ఎస్లో చేరిపోయారు. బిజెపి అనుసరించే మజ్లిస్ వ్యతిరేక వ్యూహం పాతబస్తీలో పనిచేయదు, ఇతర చోట్ల అవసరమే లేదు. మొత్తంపైన బిజెపి కూడా కెటిఆర్ సవాలును గుర్తు చేయడం తప్ప తను ఏ సవాలు విసిరే ప్రసక్తి లేదు.
కాంగ్రెస్ నాయకులు ఎదురుదాడి చేస్తున్నా ఈ ఎన్నికల్లో పలితాలపై ఏ ఆశాలేదని బహిరంగంగానే చెబుతున్నారు. గత కార్పొరేషన్లో సింగిల్ బిగ్గెస్ట్ పార్టీ ఈసారి సింగిల్ డిజిట్పార్టీగా మిగిలిపోతుందనే జోకులు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో వారు ప్రతిసవాలు చేసే అవకాశం అస్సలు లేదు. వామపక్షాలకు ఇలాటివి మామూలుగానే అలవాటు ఉండదు గనక సమస్యే లేదు. ఎలాగో బతికి బయిట పడాలని మాత్రమే వారు కోరుకుంటున్నారు. కనుక వారి సవాలు ముచ్చటే లేదు. సన్యాసం స్వీకరిస్తామని చేసిన సవాలును కెటిఆర్ స్వాగతించారు కూడా.
టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ మంత్రులూ ప్రజాప్రతినిధులకు డివిజన్ల వారీ బాధ్యత అప్పగించారు గనక వారు కిందామీదపడి వనరులు సమీకరిస్తున్నారు. అదే మిగిలిన మూడు పార్టీలలోనూ ఎవరూ బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేరు. చంద్రబాబు నాయుడు అస్సలు ఈ పోరాటంలో పాల్గొంటారా అన్నదే సందేహంగా వుంది. కార్పొరేషన్ రాజకీయ సమరంలో నేతల సవాళ్ల యుద్ధం అదనపు ఆకర్షణ మాత్రమే!