ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడమే తమ ప్రథమ కర్తవ్యం అన్నట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోంది. 2019లో అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీ తొలి సంతకం హోదా ఫైల్ మీద పెట్టడానికి రెడీ అంటోంది. పార్లమెంటులో టీడీపీ అవిశ్వాసం పెడితే, మద్దతు కూడా ఇచ్చారు. దీంతో కాంగ్రెస్, టీడీపీలు కలవబోతున్నాయన్న విమర్శలు చేయడం మొదలుపెట్టింది భాజపా! జగన్ కూడా ఇదే తరహాలో విమర్శలు చేశారు. ఇలాంటి వాతావరణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికరమైన చర్చకు దారితీసేలా ఉన్నాయి.
ఒంగోలులో ధర్మపోరాట దీక్ష చేపట్టింది టీడీపీ. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… ఎన్డీయే ప్రభుత్వాన్ని టీడీపీ ఎంపీలు పార్లమెంటులో గడగడలాడించారని ప్రశంసించారు. ఇదో దూకుడుతో పోరాటాన్ని కొనసాగించి ప్రత్యేక హోదా సాధించి తీరతామన్నారు. ఏపీ హోదా కోసం ఢిల్లీలో టవర్ ఎక్కిన వరంగల్ యువకుడిని ఈ సందర్భంగా సీఎం అభినందించారు. అయితే, ప్రత్యేక హోదా కోసం తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా తన తప్పును తెలుసుకుందన్నారు. అందుకే అవిశ్వాసానికి మద్దతు ఇచ్చిందని వ్యాఖ్యానించారు.
ఏపీ హోదా అంశమై ఇప్పుడు కాంగ్రెస్ కూడా సానుకూలంగా మారింది. ఆ అజెండా ఎత్తుకోవడం అనేది పార్టీపరంగా వారికి రాష్ట్రంలో అత్యవసరం కాబట్టి! ఈ క్రమంలో ఢిల్లీలో టీడీపీ చేస్తున్న పోరాటానికి కూడా మద్దతు తెలిపారు. అయితే, కాంగ్రెస్ ఇస్తున్న మద్దతు అంశమై ఇంతవరకూ చంద్రబాబు ఇలా ఓపెన్ గా మాట్లాడిన సందర్భం లేదు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ తప్పు తెలుసుకుందనే అన్నారు. కానీ, ఈ పాయింట్ ను పట్టుకుని… కాంగ్రెస్ విషయంలో చంద్రబాబు సానుకూలంగా మారుతున్నారనడానికి ఇదే ఉదాహరణ అంటూ ప్రతిపక్షాల విమర్శలకు ఆస్కారం కనిపిస్తోంది.
ప్రాక్టికల్ గా చూసుకుంటే… ఏపీకి హోదాకి కాంగ్రెస్ కట్టుబడి ఉన్నట్టు ప్రకటనలు చేసినా, అదే హోదా సాధన కోసం కేంద్రంపై పోరాటం చేస్తున్న టీడీపీ మద్దతు ఇస్తుందా అనేది అనుమానమే. రాజకీయాల్లో శాశ్వత శతృవులు ఉండరనే సూత్రాన్ని అప్లై చేసి చూసుకున్నా… కాంగ్రెస్ వ్యతిరేకత నుంచి టీడీపీ పుట్టింది. అంతేకాదు, ఆంధ్రా ఈరోజున పడుతున్న అవస్థలకు నాడు అధికారంలో ఉండి కాంగ్రెస్ చేసిన అసంబద్ధ విభజనే కారణం. కేంద్రంలో మేమే అధికారంలోకి వస్తాం, హోదా ఇస్తాం, కాబట్టి ఏపీలో ఏ పార్టీ గెలిచినా తమకే మద్దతు ఇస్తుందన్న విశ్వాసం కాంగ్రెస్ లో ఉండొచ్చు! కానీ, అంతకంటే ముందుగా… ఏపీ పరిధిదాటి ఆలోచిస్తే, జాతీయ స్థాయిలో భాజపాకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ సోలోగా నిలబడుతుందనే పూర్తిస్థాయి నమ్మకం ఎవ్వరికీ లేదు. ఏపీలో ప్రతిపక్షాలు ఇంతదూరం ఆలోచించవు కాబట్టి… చంద్రబాబు వ్యాఖ్యల్ని విమర్శలుగా మార్చుకునే ప్రయత్నం కచ్చితంగా చేస్తారనే అనిపిస్తోంది.