తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు ఎక్కడున్నాయి..? రెండోసారి విజయం సాధించిన తెరాస, సంఖ్యా బలం దండిగా ఉన్నా కూడా… వలసల్ని ప్రోత్సహించింది. కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా అంటూ లేకుండా చేసింది. సీఎల్పీని విలీనం చేసే వరకూ నిద్రపోలేదు! ఆ విలీన ఆపరేషన్ కి తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గదర్శకత్వంలోనే జరిగిందని అప్పట్లో చాలా కథనాలు వచ్చాయి. పట్టుబట్టి మరీ తెరాసను ధీటుగా ప్రశ్నించే ప్రతిపక్షమంటూ ఏదీ లేకుండా చేసుకున్నారు. ఇదంతా ఇప్పుడెందుకు గుర్తుచేసుకోవడమంటే… ప్రశ్నించే గొంతు గురించి కేటీఆర్ మాటలు వింటే ఎవరికైనా ఇవే గుర్తొస్తాయి.
ప్రశ్నించే గొంతు కచ్చితంగా ఉండాలనీ, అలాంటిది లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… ఒక అంశమ్మీద చర్చకు ఆస్కారం ఉండాలనీ, తర్కానికి ప్రాధాన్యత ఇవ్వాలనీ, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసుకునే వెలుసుబాటు ఇవ్వాలనీ అది లేకపోతే అర్థమేముందన్నారు! ప్రస్తుతం మనదేశంలో ఇలాంటి చర్చకు ఆస్కారం లేకుండా పోయిందన్నారు. చరిత్ర అంటే ప్రతికూల, అనుకూల శక్తుల మధ్య జరిగే ఒకరమైన సంఘర్షణే అంటూ నిర్వచించారు! కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన ఉంటుందో లేదా అనేది ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు!
ఆహా, తెరాస ఎంత ఓపెన్ మైండెడ్ గా ఉందీ అనిపిస్తుంది! విమర్శల్ని ఇంత సహృదయంతో, విమర్శల్ని ఇంత విశాల దృక్పథంతో స్వాగతిస్తున్నారా అనిపిస్తుంది. ప్రశ్నించే గొంతు ఉండటమే ప్రజాస్వామ్యం అని అంటున్నప్పుడు… ఆ గొంతును నొక్కేసే పనే కదా తెరాస చేసింది అనేది ఎవరికైనా సహజంగా గుర్తొస్తుంది. ప్రశ్నించే గొంతు అంటే… ప్రతిపక్షాలది కూడా అదే కదా! మరి ప్రతిపక్షాలను విలీనం చేసుకోవడం, సభ్యుల్ని ఆకర్షించడం, రాజీనామాలైనా చేయించకుండా ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం… రాజ్యాంగబద్ధంగానే విలీనాలు చేశామని బుకాయిస్ఊత ఒక పార్టీకీ ఆ పార్టీ శాసన సభా పక్షానికీ ఉన్న తేడాని ప్రజలకు అర్థం కానీయకుండా మాట్లాడటం… ఇవన్నీ ప్రశ్నించే గొంతును నొక్కేసే చర్యలుగా కేటీఆర్ కి కనిపించడం లేదా? ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలకుగానీ, ఆరోపణలకుగానీ అధికార పార్టీగా బాధ్యతాయుతంగా తెరాస సమాధానాలు ఇస్తోందా..? ప్రశ్నించే గొంతు ఉండాలని ఇలా మంచి మాటలు చెప్పేముందు… తామేం చేస్తున్నామో అనే ఆత్మ విమర్శ చేసుకుంటే కొంత బాగుండేదేమో కాదా!