కరోనా నియంత్రణ చర్యల విషయంలో తెలంగాణ సర్కార్ తీరుపై గవర్నర్ తమిళిశై విరుచుకుపడటం.. రాజకీయంగానూ కలకలం రేపుతోంది. గవర్నర్ విషయంలో టీఆర్ఎస్ నేతలు.. కొంత మంది దూకుడుగా ప్రకటనలు చేశారు. ఆమె బీజేపీ తెలంగాణ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారంటూ… కొంత మంది ఎమ్మెల్యేలు ట్వీట్లు పెట్టి.. వివాదం అయ్యే సరికి డిలీట్ చేశారు. కొంత మంది నేతలు బహిరంగ ప్రకటనలు చేశారు. ఆ తర్వాత హైకమాండ్ నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయేమో కానీ జోరు తగ్గించారు. అయితే.. టీఆర్ఎస్ నేతలు ఇచ్చిన ఆ లిమిటెడ్ స్పందనతోనే బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. టీఆర్ఎస్ పాలనపై విమర్శలు ప్రారంభించారు.
తెలంగాణ గవర్నర్ తమిళిశై.. ఓ డాక్టర్ కాబట్టి..ఆమె క్షేత్ర స్థాయిలో హాస్పిటల్స్‌ను పర్యవేక్షించారు కాబట్టి అలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారని.. అందులో రాజకీయం లేదని బీజేపీ నేతలు చెప్పడం ప్రారంభించారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు దగ్గర్నుంచి… లక్ష్మణ్ వరకూ.. అందరూ తమిళిశై వ్యాఖ్యలు నిజమేనన్నారు. గవర్నర్‌పై ఎదురుదాడి చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు. బీజేపీ నేతలకు ఇదో మంచి అవకాశంగా దొరికింది. కరోనా విషయంలో ప్రభుత్వం తీరును ఎండగట్టేందుకు వారికి గవర్నర్ మంచి అవకాశాన్ని ఇచ్చినట్లయింది.
అయితే ఈ విషయంలో కాంగ్రెస్ మొదటి నుంచి ఒకే విధానంతో ఉంది. కరోనా కట్టడితో తెలంగాణ సర్కార్ విఫలమయిందని ఆరోపిస్తూ వస్తోంది. ఇప్పుడు గవర్నర్ చేసిన విమర్శలను తప్పక స్వాగతించాల్సిన పరిస్థితి. అయితే.. అలా చేస్తే.. ఇబ్బందికరం అందుకే.. భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. గవర్నర్ విమర్శలు చేయడం కాదు.. పరిస్థితిని చక్కదిద్దాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్ పొలిటికల్ గేమ్స్ ఆడుతున్నాయని ఆరోపిస్తోంది. కేంద్ర బృందం వచ్చి రాష్ట్ర ప్రభుత్వం బాగా పనిచేస్తుందని ప్రశంసించారని.. గవర్నర్ సరిగా పనిచేయడం లేదని అంటున్నారని.. మరి కేంద్ర బృందానికి అసలు విషయం గవర్నర్ ఎందుకు చెప్పలేదని ప్రశఅనిస్తోంది. గ్రేటర్ ఎన్నికల కోసం రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నారని కాంగ్రెస్ అంటోంది. రాష్ట్రపతి, ప్రధానికి నివేదిక పంపిఉంటే గవర్నర్‌ని నమ్మేవాళ్లమని లాజిక్‌లు బయటకు తీస్తోంది.
తెలంగాణ సర్కార్‌పై గవర్నర్ విమర్శలపై మరి కొద్ది రోజులు రాజకీయం నడిచే అవకాశం ఉంది. ఎవరి కోణంలో వారు దీన్ని తీసుకుంటారు.. అంత వరకూ బాగానే ఉన్నా… అసలు కరోనాపై ఏమైనా దృష్టి పెడతారా లేదా అనేది ముఖ్యం.