పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణకు సీఎం అవుతారంటూ.. ఇటీవల సోషల్ మీడియాలో కొంత మంది ప్రచారం ప్రారంభించారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్లు తాము రేవంత్ సర్కార్ ను కూల్చబోమని కానీ.. నల్లగొండ, ఖమ్మం నుంచి ఉన్న బాంబులే కూల్చేస్తాయని చెబుతూ వస్తున్నారు. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగలేటి శ్రీనివాసరెడ్డిలే కూల్చేస్తారన్నట్లుగా మాట్లాడుతున్నారు.
ఈ ప్రచారానికి కొనసాగింపుగా గాదె ఇన్నయ్య లాంటి కొంత మంది అప్రకటిత మేధావులు.. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేసుకుంటున్నారు. బీజేపీతో ఒప్పందం చేసుకునే పొంగులేటి కాంగ్రెస్ లోకి వచ్చారని. లోక్ సభ ఎన్నికలు అయిన తర్వాత ఆయన తన వర్గం ఎమ్మెల్యేలను తీసుకుని బీజేపీలోకి వెళ్తారని రేవంత్ సర్కార్ కూల్చి సీఎం అవుతారని అంటున్నారు . మరికొంత మంది కాంగ్రెస్ హైకమాండే రేవంత్ ను మార్చి.. పొంగులేటిని సీఎంను చేస్తుందని అంటున్నారు.
ఈ ప్రచారాలు అంతకంతకూ తీవ్రమవతున్నాయి. మీడియా ప్రతినిధులు కలిసినప్పుడు వీటిపై పొంగులేటి పిచ్చాపాటిగా మాట్లాడారు. పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయని.. తన దగ్గర పండ్లు ఉన్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట రోజు ఉంటే నంబర్ 2 ఎలా అవుతానని ప్రశ్నించారు. హైకమాండ్ కూడా నేను సీఎం కావాలంటే కొన్ని ఈక్వేషన్స్ చూస్తుంది కదా..! అని ప్రశ్నించారు.
ప్రతీ నాయకుడికి సీఎం అవ్వాలనే కోరిక ఉంటుంది. కానీ ఇలా ప్రచారం జరిగితే మాత్రం.. పార్టీలో గడ్డు పరిస్థితులు ఏర్పడటానికి ఎక్కవ కాలం పట్టదు. తనను టార్గెట్ చేస్తున్నారని.. పొంగులేటికి అర్థమై ఉంటుంది. మరి తన తన నమ్మకాన్ని ఎలా కాపాడుకుంటారో ?