తెలంగాణలో ప్రతిపక్షం ఎవరో తేల్చుకోవడానికే దుబ్బాకలో రాజకీయం నడుస్తోందా..? అంటే..అవుననే అంటున్నాయి రాజకీయవర్గాలు. దుబ్బాకలో అధికార పార్టీగా ఉండి.. సిట్టింగ్ స్థానాన్ని టీఆర్ఎస్ కోల్పోయే అవకాశం లేదు. ఆ విషయం కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారికి తెలుస్తోంది. అయితే..టీఆర్ఎస్కు ఎవరు పోటీ ఇస్తారన్నదానిపై చర్చోపచర్చలు కొద్ది రోజులుగా నడుస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి వేరే ఏ నేత పోటీ చేసినా… కాంగ్రెస్ గురించి పెద్దగా చర్చించుకునేవారు కాదు. కానీ చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు.. టీఆర్ఎస్ నుంచి వచ్చి… కాంగ్రెస్ లో చేరి… పోటీకి సై అనడంతో పరిస్థితి మారిపోయింది.
ముత్యంరెడ్డికి దుబ్బాక మొత్తంగా ఉన్న పేరుతో పాటు … టీఆర్ఎస్పై అసంతృప్తి కలసి వస్తుందని నమ్మకం పెట్టుకున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతలంతా దుబ్బాకలో మకాం వేసి .. ఒక్కో మండలం బాధ్యతను తీసుకుని ప్రతిష్టాత్మకంగా పని చేస్తున్నారు. ఈ సమయంలో బీజేపీ రేసులో లేదని అనుకోవడం ప్రారంభించారు. అనూహ్యంగా టీఆర్ఎస్ బీజేపీని టార్గెట్ చేయడం.. రూ. పదహారు లక్షలు పట్టుకోవడం.. ఆ తర్వాత పరిణామాలతో పరిస్థితి ఒక్క సారిగా మారిపోయింది. టీఆర్ఎస్ ప్రత్యర్థి బీజేపీనే అన్నట్లుగా ప్రచారం ఊపందుకుంది. ఖచ్చితంగా ఇలాంటి డెవలప్మెంట్ కోసమే..రాజకీయం నడుస్తోందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చివరి క్షణంలో జెల్ల కొట్టడానికి ఓటర్ల ప్రయారిటీ.. బీజేపీ లేదా టీఆర్ఎస్ మధ్య ఉండటానికి ప్రస్తుత రాజకీయం నడుస్తోందని అంటున్నారు.
దీన్ని కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుందో అనే చర్చ నడుస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్ కావాలని రాజకీయాలు చేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెడుతున్నారు కానీ… అంతకు మించి కౌంటర్ ఇవ్వాల్సి ఉంది. లేకపోతే… కాంగ్రెస్ ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది. దుబ్బాకలో గెలుపుపై కాకుండా.. ఎవరు టీఆర్ఎస్కు పోటీ ఇస్తారో.. వారే ప్రతిపక్షంగా… వచ్చే ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.