కేంద్రంలో అయినా రాష్ట్రాల్లో అయినా మోడీని ఓడించాలంటే ఉచితాలను మించిన బ్రహ్మాస్త్రం లేదని కాంగ్రెస్ సహా ఇతర పార్టీలన్నీ ఫిక్సవుతున్నాయి. ఈ మేరకు వారు ప్రకటనల్లో కాకుండా కార్యాచరణలో ఈ విషయాన్ని బయట పెట్టేస్తున్నారు. దేశంలో ఇప్పుడు బీజేపీకి.. ఇతర పార్టీలకు మధ్య పోటీ జరుగుతోందని ఎవరూ అనుకోవడం లేదు. మోడీకి ితర పార్టీలకు మధ్య పోటీ జరుగుతోంది. ఆయనను ఢీ కొట్టే నేత లేరు. అందుకే అన్ని పార్టీలు రాష్ట్రాలు.. కేంద్ర స్థాయిల్లో ఉచితాల వరద పారించి మోడీని కట్టడి చేయాలనుకుంటున్నాయి.
గుజరాత్లో రూ. 500కే గ్యాస్ సిలిండర్… ఇంకో ఎన్నో ఉచిత హామీలిచ్చిన కాంగ్రెస్ !
గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘంగా అధికారం అందని చరిత్ర. గత ఎన్నికల్లో కాస్త గెలుపు దగ్గరకు వచ్చినా.. దూరంగానే ఉండిపోవాల్సి వచ్చింది. ఒకప్పుడు గుజరాత్ కాంగ్రెస్‌కు కంచుకోట లాంటిదే. సరైన నాయకుడు లేవకపోవడమే కాంగ్రెస్‌కు లోటు. ఈ సారి కూడా అలాంటి సమస్య ఉంది. కానీ అటువైపు మోడీ ఉన్నారు . అందుకే రాహుల్ మోదీకి పోటీగా ఉచితాల హామీలను తెరపైకి తెచ్చారు. రూ. ఐదు వందలకు గ్యాస్ సిలిండర్‌తో ప్రారంభించి.. రైతులకు రూ. మూడు లక్షల రుణమాఫీతో పాటు లెక్కలేనన్ని ఉచిత పథకాలు ప్రకటించారు. ఇవి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. గుజరాత్ ప్రజలకు ఇవి చాలా కొత్తవే. కాంగ్రెస్ ఈ ఉచితాల విషయంలో ఉదారంగానే ఉంటోంది. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ హామీలిస్తోంది. జాతీయ స్థాయిలో ఇవే హామీలిస్తే.. సామాన్యుల్నీ ఆకట్టుకునే అవకాశం ఉంది.
ఉచితాల మీదే ఆధారపడుతున్న ఆమ్ ఆద్మీ !
కొత్త రాజకీయం చేస్తామని వచ్చిన కేజ్రీవాల్ కూడా మోడీని కట్టడి చేయడానికి ఉచితాలే అస్త్రమనుకుంటున్నారు. పంజాబ్‌లో విద్యుత్ సంక్షోభం తీవ్రంగా ఉన్నా.. మూడు వందల వరకు యూనిట్ల వరకూ కరెంట్ ఉచితం అని ప్రకటించారు. అమలు ప్రారంభించారు. ఆమ్ ఆద్మీ చాలా వరకూ ఉచిత పథకాల హామీలిచ్చింది. అవన్నీ అమలు చేయాల్సి ఉంది. వాటినే ఇతర రాష్ట్రాల్లోనూ ఇస్తోంది. ప్రజలు తమ వైపు ఆకర్షితులయ్యేలా చూసేందుకు అన్ని ప్లాన్లు అమలు చేసుకుంటోంది.
ఉచితాలకు వ్యతిరేకంగా మోడీ క్యాంపైన్ – పోటీ హామీలివ్వలేని పరిస్థితి !
ప్రధాని మోడీ ఇటీవలికాలంలో ఉచితాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అలా చేయడం దేశానికి నష్టమంటోంది . అయితే విపక్షాలు మాత్రం ఎదురుదాడికి దిగి అవే హామీలిస్తున్నాయి. అదే ఇప్పుడు మోడీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేలా చేస్తున్నాయి. ఉచితాలపై తమ ప్రభుత్వం వ్యతిరేకత విధానంతో . . మోడీ స్వయంగా ప్రకటనలు చేసినందున కాంగ్రెస్, ఆప్ వంటి పార్టీలు ఇస్తున్న హామీలతో వాటికి మైలేజ్ పెరుగుతోంది. మోడీకి తగ్గుతోంది. ఇప్పుడు తన మాటలను కాదని.. ఆయన ఉచితాలను ప్రజలకు ప్రకటిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది
భారత ఓటర్లు ఉచిత హామీలను కాదనుకునే పరిస్థితి లేదు. దీన్ని మార్చాలని మోడీ అనుకుంటున్నారు. మార్చగలిగితే మోడీకి తిరుగుతుండదు.. ఒక వేళ ప్రజలు ఉచితాలకే ఓటు వేస్తే.. మొదటికే మోసం వస్తుంది.