తెలంగాణలో విపక్షాలకు ” చింతమడక పథకం ” వరంలా మారే అవకాశం కనిపిస్తోంది. మామూలుగా.. ఇలాంటి పథకాలు అధికారపక్షానికి అనుకూలంగా ఉంటాయి. కానీ ఈ పథకాన్ని విపక్ష పార్టీలు అసువుగా వాడేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. నిజానికి ” చింతమడక పథకం ” అనేది… లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్.. తన స్వగ్రామానికి .. మంచి చేయాలనుకుని.. ఆ గ్రామానికి వెళ్లి.. ఇంటికి రూ. పది లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించి వచ్చారు. అంతే.. కాదు.. ఆ సొమ్ముతో.. ఏ వ్యాపారాలు చేయాలో కూడా.. సూచించారు. ఆర్థికంగా ఎదగమని… చింతమడక ప్రజలందరికీ చెప్పి.. ఎన్ని చేసినా.. మీ రుణం తీర్చుకోలేమని కృతజ్ఞత చూపారు. అప్పటినుంచి రాజకీయ పార్టీలు… కేసీఆర్ పై మండి పడుతున్నాయి. చింతమడక ప్రజలకు కుటుంబానికి రూ. పది లక్షలు ఇచ్చినందుకు కాదు.. తెలంగాణ ప్రజలందరికీ ఇవ్వనందుకు..!
కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా.. చింతమడక ప్రజలకు ఇచ్చినట్లే.. తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబానికి రూ. పది లక్షలు ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ” చింతమడక పథకం ” పేరుతో ఓ స్కీమ్ పెట్టి.. రాష్ట్రం మొత్తం అమలు చేయాలంటున్నారు. టీఆర్ఎస్ వ్యూహాలతో.. తన ప్రతిపక్ష హోదాను కోల్పోయిన భట్టి విక్రమార్క… ఈ విషయంలో మరింత పట్టుదలగా ఉన్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు.. దీన్నో అస్త్రంగా మార్చుకోవాలనుకుంటున్నారు. రెండు, మూడు రోజులకోసారి ప్రెస్మీట్ పెట్టి.. విమర్శలు గుప్పిస్తున్నారు.
నిజానికి టీఆర్ఎస్… మేనిఫెస్టోలో.. ఒకే సారి రూ. లక్ష రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. గెలిచిన తరవాత విడతల వారీగా చేస్తామని చెప్పారు. కానీ… ఏడాది గడుస్తున్నా… రుణమాఫీ ఊసే చేయడం లేదు. దీనిపైనా కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే రైతు బంధు పథకం కింద.. రెండో విడత ఇవ్వాల్సిన సమయం దగ్గర పడినప్పటికీ.. తొలి విడత ఇంకా సగం మంది రైతులకు అందలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. చింతమడకు.. ఇంటికి రూ. పది లక్షలు ప్రకటించడం… చాలా మందిని ఆశ్చర్య పరిచింది. ఈ అంశం ఆధారంగానే… కేసీఆర్ సర్కార్ ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజల్లో కూడా.. తాము కూడా చింతమడక ప్రజల్లాంటి వాళ్లమేననే భావన కలిగి.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.