తెలుగుదేశం పార్టీని విమర్శించాలి అనగానే ప్రతిపక్ష పార్టీ వైకాపాకి దొరికే ప్రధాన ఆయుధం… ఏపీ మంత్రి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ వ్యాఖ్యలు! ఆ విషయం టీడీపీకి కూడా తెలియంది కాదు. లోకేష్ పొరపాటున ఎక్కడ ఏ ముక్క నోరు జారినా.. దాన్ని పేద్ద ఇష్యూ చేసేందుకు వైకాపా నేతలు మైకులు ఆన్ చేసి పెట్టుకుంటారనేది అందరికీ తెలుసు! అది ఏ స్థాయిలో ఉంటుందనేది కూడా చాలాసార్లు టీడీపీకి అనుభవంలోకి వచ్చిందే. అందుకే, ప్రత్యేకంగా కొంతమంది నిపుణులను నియమించి మరీ చినబాబుకు స్పీచ్ శిక్షణ తీసుకుంటున్నట్టు కూడా ఈ మధ్య చెప్పుకుంటున్నారు. అయినా సరే.. ఇప్పుడు మళ్లీ కాస్త తడబడ్డారు మంత్రి నారా లోకేష్.
మాజా ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నుంచే ఆయన ప్రధాని అయ్యారని.. కాస్త తడబడి, వెంటనే గొంతు సవరించుకున్నారు. తెలుగు ప్రజల నుంచీ ఆయన ప్రధాని అయ్యారని చెప్పబోయి.. అలా టంగ్ స్లిప్ అయ్యారు. ఇప్పుడు ఇదే ఇష్యూపై మరోసారి వైకాపా విమర్శలు గుప్పిస్తుందనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించినా ఆశ్చర్య పోనక్కర్లేదు. ఎందుకంటే, పీవీ నరసింహారావు ఆ పార్టీకి చెందినవారు కాబట్టి. నిజానికి, ఇలా నోరు జారడం అనేది చాలా చిన్న విషయమే. మీడియా ముందు, సభల్లో మాట్లాడేటప్పుడు ఎంతటి వక్తలకైనా ఇలాంటి తడబాట్లు తప్పవు. తప్పులు దొర్లుతూ ఉంటాయి, వాటికి సవరణలు కూడా ఉంటాయి. అయితే, నారా లోకేష్ విషయంలో ఇలా పదేపదే తప్పులు దొర్లడం… టీడీపీకే కాస్త ఇబ్బందికరమైన పరిణామం.
ఆ మధ్య బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ‘వర్థంతి’ అంటూ మాట్లాడేశారు. అంతేనా… వర్థంతికి శుభాకాంక్షలు కూడా చెప్పేసి విమర్శల పాలయ్యారు. ఇక, మంత్రిగా ప్రమాణం చేస్తున్న సందర్భంలో కూడా తడబడుతూ మాట్లాడారు. నిజానికి, ఇవి చిన్నచిన్న పొరపాట్లే అయినా… వీటినే పెద్ద అస్త్రాలుగా వైకాపా సంధిస్తూ వస్తోంది. గడచిన వారంలోనే వైకాపా ఎమ్మెల్యే రోజా మరోసారి ఇవే తడబాటులను గుర్తు చేస్తూ.. జయంతికీ, వర్థంతికీ తేడా తెలియని నారా లోకేష్, ప్రతిపక్ష నేత జగన్ కు సవాలు చేయడమేంటన్నారు. సింహం ముందు పందికొక్కు తొడలు కొట్టినట్టుగా హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. సో.. లోకేష్ పై ఇంత ఫోకస్ ఉంది! కాబట్టి, ఇప్పటికైనా నారా లోకేష్ కాస్త జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని టీడీపీ వర్గాలకు చెందినవారే అభిప్రాయపడుతున్నారు. మరి.. గతంలో లోకేష్ నియమించుకున్నారంటున్న స్పీచ్ థెరపిస్టులూ, స్క్రిప్ట్ గురువులు ఏమయ్యారో..? వారి దగ్గర లోకేష్ నిజంగానే శిక్షణ తీసుకుంటున్నారా…?