బడ్జెట్ కేటాయింపుల విషయమై తెలుగుదేశం ఎంపీలు పార్లమెంటు లోపలా బయటా కొంత నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. ప్లకార్డులు పట్టుకుని భాగస్వామ్య పక్షమైన భారతీయ జనతా పార్టీపై నిరసన తెలిపారు. రెండోరోజు కూడా ఇలాంటి పరిస్థితి కనిపించే ఆస్కారం ఉంది. అయితే, ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ వైకాపా ఏం చేస్తున్నట్టు..? ఆ పార్టీ పార్లమెంటు సభ్యులు చేస్తున్న ప్రయత్నమేంటీ..? టీడీపీ, భాజపా నేతలు రాష్ట్రస్థాయిలో పరస్పరం విమర్శలు చేసుకుంటూ ఉంటే… ప్రేక్షక పాత్ర పోషిస్తోందా..? రాష్ట్ర ప్రయోజనాల అంశానికి వచ్చేసరికి, ఢిల్లీ స్థాయిలో పార్టీలకు అతీతంగా వ్యవహరించే పరిస్థితి ఉంటుందా..? వైకాపా వైఖరిని గమనిస్తున్నవారికి ఇలాంటి అనుమాలే కలుగుతున్నాయి.
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున వైకాపా ఎంపీలు ఢిల్లీలో కొంత హడావుడి చేశారు. మీడియా ముందుకు వచ్చి కేంద్రం తీరుపై విమర్శలు చేశారు. చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న మెతక వైఖరి వల్లనే రాష్ట్రానికి కేటాయింపులు దక్కలేదని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రా ప్రయోజనాల అంశమై రాజీనామాలకు కట్టుబడి ఉన్నామనీ, అయితే తాము రాజీనామాలు చేస్తే… పార్లమెంటులో ఆంధ్రా తరఫున స్వరం వినిపించేవారు ఎవరుంటారనీ, అందుకే ఆగుతున్నామన్నట్టుగా వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తమకు అంత బాధ్యత ఉందని చెప్పారు కదా… కానీ, సోమవారం నాడు లోక్ సభ ప్రాంగణంలో వైకాపా ఎంపీలు కనిపించకపోవడం విశేషం! అంతేకాదు, రాజ్యసభలో విజయసాయి రెడ్డి కూడా కనిపించని పరిస్థితి! ఓవరాల్ గా ఢిల్లీలో ఇప్పుడు ఏపీ ప్రయోజనాల విషయమై వైకాపా చేస్తున్న కృషి అంటూ ఏదీ కనిపించడం లేదు.
‘తాజా పరిస్థితులను వైకాపా నిశితంగా గమనిస్తోంద’ని వారు గంభీరంగా చెప్పుకోవచ్చేమోగానీ… రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చేసరికి పార్టీలకు అతీతంగా ఢిల్లీ స్థాయిలో పోరాడదాం అనే ధోరణి వైకాపాలో కనిపించడం లేదు. పక్కరాష్ట్రం తమిళనాడు తీసుకుంటే… రాజకీయాలు ఎలా ఉన్నా, జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి అధికార ప్రతిపక్షాలు కలిసే పోరాటం చేస్తాయి. అలాంటి ఐకత్యారాగం ఆంధ్రా పార్టీల నుంచి ఊహించలేం! ఒకరకంగా ఏపీ విషయంలో కేంద్రం వైఖరి అలా ఉండటానికి కారణం ఈ పరిస్థితే. సో… మిత్రపక్షమైన భాజపాపైనే టీడీపీ ఎంపీలు నిరసన గళం వ్యక్తం చేస్తుంటే, వైకాపా సభ్యులు ఏం చేస్తున్నట్టు..? చివరి అస్త్రంగా రాజీనామాలు చేస్తామని చెప్పిన వైకాపా నేతలు కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలేవీ..? ఆంధ్రాపై కేంద్రం చిన్నచూపునకు కారణం చంద్రబాబే అని వేలెత్తి చూపే పనిలో మాత్రమే వైకాపా ముందుంటోంది. అంతేతప్ప.. రాజకీయాలకు అతీతంగా వైకాపా ప్రయత్నమంటూ ఏదీ ప్రస్తుతం కనిపించడం లేదు.