తెలంగాణ సీఎం కేసీఆర్ నాలుగు రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు. ఓ వైపు కేటీఆర్ కాలి గాయం కారణంగా ఇంటికే పరిమితయ్యారు. సీఎం ఢిల్లీలో ఉన్నారు. దీంతో రాష్ట్రంలో పాలన యాంత్రికంగా మారింది. వరద బాధితుల్ని ఆదుకునేవారు కనిపించడం లేదు. అయితే కేసీఆర్ మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నారు. జాతీయ రాజకీయాలపై ఆయన చేస్తున్న చర్చలేమీ లేవని తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లిన మూడు రోజుల్లో ఆయన ఒక్క అఖిలేష్ యాదవ్‌తో మాత్రమే భేటీ అయ్యారు.
జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్‌కు పరిస్థితులు కలిసి రావడం లేదు. బీజేపీని ఎదుర్కొనే విషయంలో ప్రాంతీయ పార్టీలు వెనుకడుగు వేస్తున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. కేసీఆర్ ఇంకా ఎవరికి మద్దతివ్వాలో నిర్ణయించుకోలేదు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా నిలబడిన కాంగ్రెస్ నేత మార్గరేట్ అల్వాకు ఓటు వేసే విషయంపై ఇంకా ఎలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకోలేదు. కానీ పలు విపక్ష పార్టీలు .. ఓటింగ్‌కు దూరంగా ఉండాలని అనుకుంటున్నాయి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. అయితే ఇంకా కలవలేదు. జాతీయ రాజకీయాల్లో భాగంగా వివిధ పార్టీల నేతలతో మాట్లాడుతురాని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఓవైపు తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి హైదరాబాద్ ను వరదలు వణికించాయి. పరిస్థితులు ఉన్నా సీఎం కేసీఆర్ ఢిల్లీలో మకాం వేయడంపై విమర్శలు వస్తున్నాయి. జాతీయ రాజకీయాల కోసం కేసీఆర్ టైం వేస్ట్ చేస్తున్నారని.. తెలంగాణను పట్టించుకుంటే బాగుంటుందని సొంత పార్టీలో కూడా సణుగుళ్లు వినిపిస్తున్నాయి. విపక్ష నేతలు ఇదే అడ్వాంటేజ్‌గా తీసుకుని కేసీఆర్ రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.