అమెరికా.. అంటే యువతకు ఓ కాంప్లెక్స్. లైఫ్ స్టైల్ కావొచ్చు.. డాలర్ డ్రీమ్స్ కావొచ్చు.. అవకాశాలు కావొచ్చు…కారణం ఏదైనా అమెరికాకు చేరుకోవడమే జీవిత లక్ష్యంగా పెట్టుకునే యువతకు ఇండియాలో కొదవలేదు. కానీ ఇప్పుడు అమెరికా వారు అనుకుంటున్న కాంప్లెక్స్ కాదు. హెల్గా మారుతోంది. ఓపీటీ బిల్లు ఆమోదించిన తర్వాత పూర్తి స్థాయి హెల్గా మారుతుంది. ఇప్పుడు అమెరికాకు వచ్చి ఆ నరకంలో ఇరుక్కుపోవడం కన్నా.. కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.
చదువుకోవడానికి వచ్చే వారిని ద్రోహులుగా చూస్తున్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. తమ దేశానికి వచ్చే వారిని ఆయన దోపిడీదారులుగా చూస్తున్నారు. లీగల్గా వస్తున్నా సరే అమెరికా నుంచి ఏదో కొట్టేయడానికి వస్తున్నారని అనుకుంటున్నారు. విద్యార్థుల విషయంలోనూ ఆయన కఠినంగా ఉంటున్నారు. ఏ చిన్న తప్పు చేసినా అమెరికా నుంచి పంపేందుకు వెనుకాడటం లేదు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘించినా సరే అమెరికా నుంచి వెళ్లిపోవాలని వీసా రద్దు చేస్తున్నారు. అన్ని దేశాల వారితో అలాగే ఉంటున్నా.. సహజంగానే ఇండియన్స్ ఎక్కువ కాబట్టి బాధితులు కూడా వారే ఎక్కువగా ఉంటున్నారు.
ఓపీటీ రద్దు చేస్తే నరకమే !
చదువుకోవడానికి వచ్చి చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు లేకపోయినా అక్కడే ఉంటున్నారని.. తరిమేయాలని నిర్ణయించుకున్నారు. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్ ..ఓపీటీ పేరుతో ఉన్న అవకాశాన్ని తీసేయాలని నిర్ణయించుకున్నారు. అంటే చదువు అయిపోగానే అమెరికా వదిలి వెళ్లిపోవాలి. విదేశీ విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత ఏడాది పాటు .. స్టెమ్ విద్యార్థులకు 36 నెలల వరకు పని చేసుకునేందుకు ఓపీటీ అవకాశం కల్పిస్తుంది . ఈ కాలంలోనే అనేక మంది పని అనుభవం సంపాదించి, H-1B వంటి వీసాలు పొందుతారు. ఇది రద్దు అయితే చదువు తర్వాత ఇంటికెళ్లిపోవాల్సిందే.
మధ్యతరగతి ఆలోచించాల్సిన సమయం !
భారతీయ విద్యార్థులు అమెరికా యూనివర్శిటీలకు ఏటా లక్ష కోట్ల మేర ఫీజులు కడుతున్నారన్న అంచనాలు ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబాలు ఆస్తుల్ని తాకట్టు పెట్టి..భవిష్యత్ ను తనఖా పెట్టి మరీ పిల్లలను అమెరికా పంపుతున్నారు. వారందరి కలలు కల్లలవుతాయి. ఆర్థికంగా కుంగిపోతారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇండియాలో మంచి ఉద్యోగాకాశం లభించినా.. చేసిన ఖర్చుతో పోలిస్తే వచ్చే ఆదాయం సరిపోదు. ఇదే ఇండియాలోనే ఉండి.. అదే ఉద్యోగం సంపాదిస్తే.. భారం కాదు.
ఎలా చూసినా ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టి అమెరికా చదువు అనే విషయంలో మధ్యతరగతి తమ ఆలోచనల్ని మార్చుకోవాల్సిన సమయం మాత్రం వచ్చిందని అనుకోవచ్చు.