తమిళనాడులో కీలక రాజకీయ పరిణామాలకు తెరలేచింది. చిన్నమ్మకు నాలుగేళ్లు జైలు శిక్ష, పదిఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హతను న్యాయస్థానం విధించింది. దీంతో పన్నీర్ సెల్వానికి లైన్ క్లియర్ అయినట్టుగానే అందరూ అనుకుంటున్నారు. చిన్నమ్మ వర్గమంతా పన్నీర్‌కు మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి క్రియేట్ అయిందని సంబరాలు కూడా చేసేసుకున్నారు. అయితే, అనూహ్యంగా శశికళ వర్గం నుంచీ పళని స్వామి తెరమీదికి వచ్చారు. దీంతో పన్నీర్ సెల్వానికి సీఎం సీటు దక్కుతుందా… లేదా అనే సందిగ్ధం అలానే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ పాత్ర మళ్లీ కీలకంగా మారింది. ప్రస్తుతం గవర్నర్ ఏం చేయగలుగుతారు..? పన్నీర్‌కు మద్దతుగా పరిస్థితులను ప్రభావితం చేసే ఆస్కారం ఉందా..? అనే కొత్త చర్చ మొదలైంది.
నిజానికి, ప్రస్తుతం గవర్నర్ ముందున్న ఆప్షన్లు కొన్నే! మొదటిదీ… బలనిరూపణ చేసుకోవాల్సిందిగా పన్నీర్‌కు అవకాశం ఇవ్వడం. కానీ, ప్రస్తుతం అలా ఆహ్వానించే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే, పన్నీర్ వెంట వచ్చే ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో ఇంకా క్లారిటీ లేదు. మెజారిటీ నంబర్ ఉందో లేదో తెలీదు. ఇక, గవర్నర్‌కు ఉన్న ఇంకో ఆప్షన్.. పళని స్వామిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరడం. ఎందుకంటే, మెజారిటీ ఎమ్మెల్యేలు తన వెంట ఉన్నారని ఆయనే లేఖ ఇచ్చారు. కాబట్టి, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి.. ఆయనకీ బలనిరూపణకు అవకాశం ఇవ్వడం. ఇది కూడా అసాధ్యమన్నట్టుగా ప్రస్తుతానికి కనిపిస్తోంది.
ఒక, మూడో అవకాశం… మొన్నటికి మొన్న శశికళ చెప్పిన మద్దతుదారుల సంఖ్య, ఇప్పుడు పళని స్వామి చెబుతున్న ఎమ్మెల్యేల సంఖ్య తేడా ఉంది. కాబట్టి, అదే కారణంగా చూపుతూ కొన్నాళ్లు పరిస్థితిని ఇలానే సుప్తచేతనావస్థలో ఉంచేయడం! దీని ద్వారా మరోసారి పన్నీరుకు సమయం ఇచ్చినట్టు అవుతుంది. మెజారిటీ బలగాన్ని పోగేసుకోవడానికి కావాల్సిన వెసులుబాటూ కల్పించినట్టు అవుతుంది! ఇక, చివరి ఆప్షన్.. తమిళనాడులో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చెయ్యడం. పరిస్థితులు ఇలానే కొనసాగితే శాంతిభద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి, నేరుగా రాష్ట్రపతి పాలన కోరే అవకాశం ఉంది. కానీ, విషయాన్ని అంతవరకూ వెళ్లనివ్వరు!
ఏదేమై, ఇప్పటికే గవర్నర్ చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. భాజపాకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనీ… పన్నీరుకు వత్తాసు పలికేలా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయన్న అపవాదు మూటగట్టుకున్నారు. తరువాత పరిస్థితులు ఎలా మారుతాయో వేచి చూడాలి.