ఏపీలో మూడు రాజధానుల నిర్ణయం అధికారికంగా కాకపోయినా అనధికారికంగా జరిగిపోయింది. ప్రభుత్వ నిర్ణయాన్ని, ఆలోచనలను బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) నివేదిక స్పష్టంగా తెలియచేసింది. మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన హైపవర్ కమిటీ ఇచ్చే నివేదిక ఇంతకంటే భిన్నంగా ఉండదు కాబట్టి ఎగ్జిక్యూటివ్ కేపిటల్గా విశాఖపట్టణం సిద్ధమైపోతోంది. మౌఖిక ఆదేశాల మేరకు అక్కడ అన్ని ఏర్పాట్లు సాగిపోతున్నాయి. ప్రభుత్వంలో కీలకభాగం సచివాలయం కాబట్టి అక్కడి ఉద్యోగులు విశాఖపట్టణానికి తరలి వెళ్లాలని ఉన్నతాధికారులు ఇప్పటికే సచివాలయం ఉద్యోగులకు మౌఖిక ఆదేశాలిచ్చారు. మానసికంగా ఇందుకు సన్నద్ధం కావాలని సూచించారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఉగాది నుంచి (మార్చి 25) విశాఖలో సచివాలయం పనిచేయడం ప్రారంభమవుతుంది. ఉగాది నుంచి సచివాలయం పూర్తిస్థాయిలో పని చేయకపోవచ్చని, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంనాటికి పూర్తిస్థాయిలో పనిచేస్తుందని తెలుస్తోంది.
రాజధాని ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్లి ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాల్సిందే కదా. హైదరాబాదు నుంచి అమరావతికి వచ్చారు. రాజధాని విశాఖకు తరలిపోతే అక్కడికి వెళ్లితీరాల్సిందే. విశాఖకు వెళ్లేది లేదంటూ ఆందోళనలు, ధర్నాలు చేయకూడదు. ఉద్యోగులు కొత్త రాజధానికి వెళ్లడంపై ఉద్యోగుల సంఘానికి చెందిన ఓ నాయకుడు మాట్లాడుతూ ఉద్యోగులకు రెండు ఆప్షన్లు ఉన్నాయని చెప్పాడు. ఏమిటవి? ఒకటి…విశాఖకు వెళ్లి డ్యూటీలో చేరడం, రెండు…ఉద్యోగం వదిలేసి వెళ్లిపోవడం. కాబట్టి ఉద్యోగం కావాలనుకుంటే విశాఖకు వెళ్లాల్సిందే. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు ఉంటుందని విభజన చట్టంలో పేర్కొన్నా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయాన్ని అమరావతికి తరలించారు. పరిపాలన ప్రజలకు చేరువలో ఉండాలని అమరావతికి తరలించినట్లు బాబు చెప్పినా, ఓటుకు నోటు కేసు కారణంగా ఇబ్బంది కలగడంతో అమరాతికి తరలించారని ప్రత్యర్థులు చెబుతుంటారు.
కారణాలు ఎలా ఉన్నా ఉద్యోగులు అమరావతికి తరలివెళ్లక తప్పలేదు. సచివాలయంలోనే కాదు, వివిధ శాఖల్లో పనిచేస్తున్న వేలాది ఏపీ ఉద్యోగులు హైదరాబాదులో పర్మ్నెంట్గా స్థిరపడిన సంగతి తెలిసిందే కదా. ఆక్కడే ఇళ్లు కట్టుకున్నారు. అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు. ఆస్తులు కూడబెట్టుకున్నారు. పిల్లలు చదువుకుంటున్నారు. అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. సంబంధ బాంధవ్యాలు అక్కడే ఉన్నాయి. ఏ కోణంలో చూసినా హైదరాబాదుతో విడదీయరాని బంధం ఉంది. ఉద్యోగుల్లో సింహభాగం కుటుంబాలను హైదరాబాదులోనే ఉంచి అమరావతికి వెళ్లారు. అప్పట్లో ఉద్యోగుల ఇబ్బందులను అర్థం చేసుకున్న సీఎం చంద్రబాబు వారి కోరిక ప్రకారం ఫైవ్డే వీక్ (వారానికి ఐదు పనిదినాలు) అమలు ప్రారంభించారు. దీంతో ఉద్యోగులు శని,ఆదివారాలు హైదరాబాదుకు వచ్చే అవకాశం కలిగింది. ఉద్యోగులు హ్యాపీగా ఫీలయ్యారు.
ఉద్యోగుల కోసం హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రత్యేక రైలు వేశారు. ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సచివాలయంలో పర్మ్నెంట్ ఉద్యోగులు 1,350 మంది కాగా, సుమారు వెయ్యి మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. సుమారు 200 మంది ఉద్యోగులు వెలగపూడి, దాని చుట్టుపక్కల, విజయవాడ, గంటూరుల్లో ఇళ్లు కట్టుకున్నారు. అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు. ఎక్కవమంది బ్యాంకు రుణాలు తీసుకొని కట్టుకున్నవారే. ఈవిధంగా ఉద్యోగులు నెమ్మదిగా స్థిరపడుతున్న నేపథ్యంలో వారి మీద ‘రాజధాని మార్పు’ బాంబు పడింది. అమరావతిలో ఉండబట్టి హైదరాబాదుకు వచ్చిపోవడం సులభంగా ఉంది. విశాఖపట్టణం వెళితే ఈ వెసులుబాటు ఉండదు. ప్రత్యేకంగా సెలవులు పెట్టుకొని హైదరాబాదుకు రావల్సిందే.
దీనివల్ల డబ్బు ఖర్చు, సమయం వృథా అవుతుందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వ నిర్ణయానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. రాజధాని విశాఖపట్టణమేనని అధికారిక నిర్ణయం వచ్చాక ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెట్టాలని ఉద్యోగులు అనుకుంటున్నారు. హెచ్ఆర్ఏ పెంపుదల, ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇవ్వడం లేదా ఇళ్లు కట్టుకోవడానికి పాతిక లక్షల వరకు రుణం ఇవ్వడం …ఇలా కొన్ని కోరికలు కోరాలని అనుకుంటున్నారట. మరి ఉద్యోగుల కోరికలను ప్రభుత్వం ఆలకిస్తుందా?