సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసి ఒకటి, రెండు రోజులు ఆడించి ఆ షేర్ ను సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం ఇటీవలి కాలంలో రొటీన్ అయింది. అయితే పెద్దగా విజయవంతం కానీ రామ్ చరణ్ ఆరెంజ్ ను రీ రిలీజ్ చేయాలని ఆ సినిమా నిర్మాత నాగబాబు డిసైడయ్యారు. అయితే అది వ్యక్తిగత లాభానికి కాదు. జనసేన కోసం.
మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆరెంజ్’ చిత్రాన్ని మరోసారి థియేటర్లలో విడుదల చేయనున్నారు. కాగా ఈ చిత్రం ద్వారా రాబోయే ప్రతి రూపాయి జనసేన పార్టీకి ఇవ్వాలని నిర్ణయించారు.
జనసేనని బలోపేతం చేసే ఈ కార్యక్రమంలో జనసైనికులంతా పాల్గొనాలని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. రామ్ చరణ్ జన్మదనం సందర్భంగా మార్చి 25, 26న కల్ట్ క్లాసిక్ ప్రేమ కథా చిత్రం ‘ఆరెంజ్’ ను మెగా అభిమానులు, జన సైనికులు సినిమా చూసి వినోదంతో పాటు జనసేనను బలపేతం చేసే ఈ కార్యక్రమంలో భాగం కావాలని కోరుతూ జనసేన తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా విజ్ఞప్తి చేసింది.
క్లాసిక్ లవ్ స్టోరీగా రూపొందిన ‘ఆరెంజ్’ ఆర్థికంగా అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే ఓ వర్గం ప్రేక్షకులకు నచ్చింది. మొన్నటివరకూ టీవీ షోస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన నాగబాబు.. ఇప్పుడిప్పుడే జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు అండగా ఉంటూ తోడుగా ఉంటున్నారు. అందులో భాగంగానే రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ రీ రిలీజ్ చేసి, దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించడం పట్ల జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.