వైపీఎస్ అధికారిగా అన్ని హద్దులు చెరిపేసి విధి నిర్వహణలో ఎవరూ చేయలేని బెంచ్ మార్కులు సృష్టించిన ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ కు గడ్డు పరిస్థితులు ఎదురు అవుతున్నాయి. ఆయనపై గతంలో నమోదు అయిన అభియోగాలపై ఇచ్చిన వివరణను ప్రభుత్వం తిరస్కరిచింది. సునీల్ కుమార్‌పై ఎంక్వయిరీకి AP సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. విచారణకు అథారిటీని వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అథారిటీలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తాలు ఉంటారు. సాధ్యమైనంత త్వరగా సునీల్ కుమార్‌పై ఉన్న అభియోగాలపై నివేదిక ఇవ్వాలని అధారిటీని ప్రభుత్వం ఆదేశించింది.
సునీల్ కుమార్ రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో నిందితుడు మాత్రమే కాదు ఆయనపై లెక్కలేనన్ని అభియోగాలు ఉన్నాయి. చాలా సార్లు కేంద్రం నుంచి ఆయనపై చర్యలు తీసుకోవాలని సూచిస్తే లేఖలు వచ్చాయి. అయితే రాజకీయ పోలీసింగ్ చేసేందుకు సీఐడీని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసిన ఆయన.. ప్రభుత్వం మారేసరికి కంగారు పడుతున్నారు. ప్రభుత్వం మారినప్పటి నుండి ఆయనకు పోస్టింగుల్లేవు. మధ్యలో సోషల్ మీడియాలో సర్వీస్ రూల్స్ ఉల్లంఘించి మరీ పోస్టులు పెట్టినందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.
ఇప్పుడు ఆయనపై వచ్చిన అభియోగాలపై విచారణ జరిపేందుకు కమిటీని నియమించారు. ఈ కమిటీ నివేదికను బట్టి ఆయనపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఐడీ పెట్టిన అనేక తప్పుడు కేసుల్లో సునీల్ ప్రమేయం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం సునీల్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. రఘురామ కృష్ణరాజు కూడా.. సునీల్ పై చర్యలకు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో విచారణ కమిటీని ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది.