విజయవాడ ప్రజల్ని వైసీపీ నేతలు ఓ మాదిరిగా కూడా చూస్తున్నట్లుగా లేరు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం అక్కడి ప్రజలకు సెంటిమెంట్ గా మారుతున్న నేపధ్యంలో అక్కడి ప్రజల్ని మచ్చిక చేసుకోవడానికి ప్రభుత్వం వివిధ రకాల చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా రాజధానికి సంబందించిన అంశాలను ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తూ ఆదేశాలు జారీ చేస్తోంది. తాజాగా.. విజయవాడలో నిర్మించాల్సిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను విశాఖకు తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ .. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఉంటుంది.
ప్రస్తుతం పోలీస్ హెడ్ క్వార్టర్ అమరావతిలో ఉంది. అందుకే అక్కడే నిర్మించడానికి గత ప్రభుత్వం నిర్ణయించింది. రూ. పదమూడు కోట్లు విడుదల చేసింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రక్రియ నిలిపివేసింది. ఇప్పుడు.. కార్పొరేషన్ ఎన్నికలకు ముందు విశాఖకు తరలిస్తూ జీవో జారీ చేశారు. కేటాయించిన నిధులను కూడా బదలాయించారు. ఎన్నికలకు ముందు విజయవాడ ప్రజల సెంటిమెంట్ ను ఈ నిర్ణయం దెబ్బ తీస్తుందని వైసీపీ నేతలు అనుకోలేదు. ప్రజలు ఏం చేసినా తమకే ఓటేస్తారన్న ఉద్దేశంతో వారున్నట్లుగా ఉన్నారు.
అందుకే… అన్నీ విజయవాడ నుంచి తరలించేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కోర్టులో ఉన్నందున అమరావతి తరలింపును అధికారికంగా చెప్పడం లేదు. కానీ ఒక్కొక్క విభాగాన్ని తరలిస్తున్నారు. ఏ ప్రభుత్వమైనా అధికారికంగా నిర్ణయం తీసుకుని.. దర్జాగా అన్నింటిని తీసుకెళ్తుంది. కానీ ఈ ప్రభుత్వం అన్నీ దొడ్డిదారి పనులు చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.