వైద్య విద్యా కోర్సులలో ప్రవేశానికి దేశ వ్యాప్తంగా ఒకే పరీక్షా విధానం ఉండాలనే ఉద్దేశ్యంతో దాని కోసం జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ‘నీట్’ ప్రవేశపరీక్షల ద్వారానే ఈ ఏడాది నుంచి దేశంలో అన్నిరాష్ట్రాలు అమలుచేయాలని కొన్ని రోజుల క్రితమే సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఆ కారణంగా వివిధ రాష్ట్రాలు నిర్వహించిన ఎంసెట్ పరీక్షా ఫలితాలు వెల్లడించలేని పరిస్థితి ఏర్పడింది. కనుక వాటి కోసం విద్యార్ధుల శ్రమ, వారి తల్లి తండ్రుల కష్టం అన్నీ వృధా అవుతాయి. దేశంలో వివిధ రాష్ట్రాలు నిర్వహించిన ఎంసెట్ పరీక్షలు వ్రాసిన లక్షలాది మంది విద్యార్ధులు, వారి తల్లి తండ్రులు సుప్రీం కోర్టు తీర్పుతో చాలా ఆందోళనకి గురవుతున్నారు.
వారి కోసం కాకపోయినా మెడికల్ కాలేజీల ఒత్తిళ్ళ కారణంగానయినా దేశంలో 20 రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం ఈ ఏడాదికి తమకు నీట్ నుంచి మినహాయింపు నివ్వాలని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నాయి. వాటి అభ్యర్ధనలను మన్నించి కేంద్ర ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరానికి మాత్రమే ఆ రాష్ట్రాలకు నీట్ నుంచి మినహాయింపు నిస్తూ ఒక ఆర్డినెన్స్ జారీ చేయాలని నిశ్చయించుకొన్నట్లు తెలుస్తోంది. మరికొద్ది సేపటిలో కేంద్ర మంత్రివర్గం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశం కాబోతోంది. దానిలో నీట్ పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు గురించి చర్చించి, సుప్రీం కోర్టుకి అభ్యంతరం చెప్పని విధంగా ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ మళ్ళీ దీనిపై కూడా ఎవరైనా సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తే మళ్ళీ సమస్య మొదటికి వచ్చే అవకాశం ఉంది.