బుధవారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో.. మూడు రాజధానులే ఎజెండా కానుంది. విధానపరంగా మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం.. అమలు చేయడానికి అనేక చిక్కులు వస్తూండటంతో… అంతిమంగా.. గట్టి నిర్ణయం తీసుకోవాలని.. జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి వచ్చారు. ఆయన “ఆర్డినెన్స్” అనే ఆప్షన్‌కు ఓటేశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం శాసనమండలిలో బిల్లులు ఉన్నాయి. సెలక్ట్ కమిటీకి వెళ్లలేదని ప్రభుత్వం వాదిస్తోంది. ఆ మేరకు చైర్మన్‌కు మండలి కార్యదర్శితో లేఖ కూడా రాయించింది. ఇప్పుడు… వెంటనే.. శాసనమండలిని ప్రోరోగ్ చేయాలని నిర్ణయించున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం శాసనమండిలో నిరవధిక వాయిదాలో ఉంది. ప్రోరోగ్ కాలేదు. ప్రోరోగ్ అయితేనే.. బిల్లుల్ని ఆర్డినెన్స్ రూపంలో తేవడానికి అవకాశం ఉంది. అందుకే.. ఆర్డినెన్స్ తేడావికి శాసనమండలిని ప్రోరోగ్ చేయాలనుకుంటున్నారు.
బుధవారం కేబినెట్ భేటీలో ఈ ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్ర వేస్తారని చెబుతున్నారు. ఆర్డినెన్స్ జారీ చేసి.. గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే.. తరలింపునకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే.. బిల్లులు మండలిలో పెండింగ్‌లో ఉండగా… ఆర్డినెన్స్ తేవడం చట్ట విరుద్ధమని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. దీన్ని గవర్నర్ అంగీకరించరని అంటున్నారు. శాసనమండలి రద్దు అయిపోతే.. బిల్లులు ల్యాప్స్ అవుతాయని.. కానీ ఇంత వరకూ.. మండలి రద్దు కాలేదని.. అంటున్నారు. ఒకవేళ శాసనమండలిని ప్రోరోగ్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పటికీ .. మళ్లీ ఆ బిల్లు శాసనమండలికే రావాల్సిఉటుందని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే.. వైసీపీ నేతల వ్యూహం మాత్రం వేరేగా ఉంది. ఆర్డినెన్స్ ఆరు నెలల పాటు ఉంటుంది. ఆ లోపు శాసనమండలి రద్దు అవుతుందని భావిస్తున్నారు. ఒక వేళ కాకపోయినా… మరో సారి ఆర్డినెన్స్ పొడిగించుకోవచ్చంటున్నారు.
అయితే.. ప్రభుత్వం దుందుడుకుగా వ్యవహరించిన కారణంగా… న్యాయపరమైన చిక్కులు వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లినట్టు చైర్మన్ ప్రకటించటంతోపాటు ప్రభుత్వ న్యాయవాది హైకోర్ట్ ధర్మాసనానికి చెప్పారు. ఇదే విపక్ష పార్టీలకు పెద్ద అస్త్రంగా మారుతోంది. సెలక్ట్ కమిటీకి వెళ్లిన బిల్లును.. ఆర్డినెన్స్‌గా తీసుకు రావడానికి చట్టాలు ఒప్పుకోవు. మరి ప్రభుత్వం ఏ వ్యూహంతో ముందుకెళ్తుందో..?