Ori Devuda Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 2.75/5
సినిమా పరిశ్రమకు సంబంధించినంత వరకూ ప్రేమకథ అంటేనే ఓ పుష్షక విమానం. ఎన్ని ప్రేమకథలొచ్చినా.. ఇంకోటి పుడుతూనే ఉంటుంది. సీజన్ అంటూ లేని జోనర్ లవ్ స్టోరీ. అయితే… ఆ ప్రేమకథలోనూ ఎక్కడో ఓ చోట `కొత్త` ఫీలింగ్ జోడించాలి. ప్రేమని ఇంకో కోణంలో చెప్పాలి. అప్పుడే మార్కులు పడతాయి. తమిళంలో వచ్చిన `ఓ మై కడవులే` కూడా లవ్ స్టోరీనే. ఇద్దరు ప్రాణ స్నేహితులు పెళ్లి చేసుకొంటే ఏమవుతుంది? అనేదే కథ. అయితే ఇలాంటి కథలు చాలా చూసేశారు జనాలు. కానీ `ఓ మై కడవులే` సూపర్ డూపర్ హిట్టయ్యింది. దానికి కారణం.. `సెకండ్ ఛాన్స్` అనే కాన్సెప్ట్ తో ముడి వేయడం. అందుకే పాత ప్రేమ కథ… కొత్త ఫ్లేవర్‌లో కనిపించింది. ఇప్పుడు ఆ సినిమాని `ఓరి దేవుడా`గా రీమేక్ చేశాడు. విశ్వక్ సేన్ హీరో. `ఓ మై కడవులే` తీసిన అశ్వత్ నే ఈ చిత్రానికీ దర్శకత్వం వహించాడు. దేవుడు పాత్రలో వెంకీని తీసుకురావడం వల్ల.. ఈ సినిమాకి ఇంకాస్త క్రేజ్ పెరిగింది. మరి.. ఈ ప్రేమ కథ ఎలా ఉంది? ఇంతకీ ఆ సెకండ్ ఛాన్స్ ఏమిటి?
అర్జున్ (విశ్వక్ సేన్), అను (మిథిలా పాల్కర్) ఇద్దరూ చిన్నప్పటి నుంచీ మంచి ఫ్రెండ్స్. పెరిగి పెద్దయ్యాక.. అర్జున్‌పై అనుకి ప్రేమ పుడుతుంది. పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అర్జున్ కూడా సరే.. అంటాడు. కానీ.. పెళ్లయిన ఏడాదికే గొడవలు పడి విడిపోతారు. ఇలాంటి సమయంలో.. జీవితాన్ని మళ్లీ ఫ్రెష్ గా మొదలెట్టే సెకండ్ ఛాన్స్ అర్జున్‌కి వస్తుంది. మరి ఈ సెకండ్ ఛాన్స్‌ని అర్జున్ ఎంత వరకూ సద్వినియోగం చేసుకొన్నాడు? ఈ కథలో మీరా (ఆశా భట్) పాత్రేమిటి? ఇవన్నీ తెరపై చూడాల్సిందే.
నువ్వే కావాలి చూశాం కదా..? అందులో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ప్రేమ పుడితే ఏమిటి? అనేది చూపించారు. ఇదీ అలాంటి కథే. కానీ వేరే కోణంలో ఈ కథని చెప్పారు. ఇద్దరు స్నేహితులు పెళ్లి చేసుకొన్న తరవాతి కథ ఇది. వాళ్ల మధ్య గొడవలు ఎలా మొదలవుతాయి? అపార్థాలు ఎలా పుట్టుకొస్తాయి? వీటి చుట్టూ తిరుగుతుంది. అలాంటి కథలూ చాలానే వచ్చాయి. అయితే.. `ఓరి దేవుడా`లో కనిపించే కొత్త పాయింట్… సెకండ్ ఛాన్స్. దేవుడు దిగి వచ్చి.. `సరే.. నీకు మరో ఛాన్స్ ఇస్తున్నా.. నీ జీవితాన్ని మళ్లీ మొదలు పెట్టుకో` అంటూ ఓ టికెట్ ఇస్తాడు. అలా మళ్లీ కొత్తగా మొదలైన జీవితంలో అయినా కథానాయకుడు తన తప్పుల్ని సరిద్దుకొన్నాడా, లేదా? అనేది ఈ సినిమాలో ఆసక్తి కరమైన అంశం. సినిమా మొదలైన కాసేపటికే పెళ్లి, విడాకుల వరకూ వెళ్లిపోతుంది. వెంకటేష్ పాత్ర ఎంట్రీ దగ్గర్నుంచి కథ కొత్త బాటలోకి వెళ్తుంది. అక్కడి నుంచి ఫ్లాష్ బ్యాక్. పెళ్లి చేసుకొన్న తరవాత అర్జున్ పడే తిప్పలు నవ్విస్తాయి. ఆ పాత్రపై సానుభూతి కలిగేలా చేస్తాయి. ముఖ్యంగా మురళీ శర్మతో ట్రాక్ గురించి చెప్పుకోవాలి. ఫస్టాఫ్‌లో… దాన్ని ఫన్ కోసమే వాడుకొన్నారు. కమోడ్ సీన్లు… అర్జున్ ఇరిటేషన్ తెప్పించినా.. ప్రేక్షకుల్ని నవ్విస్తాయి. అయితే.. అదే కమోడ్ గురించి సెకండాఫ్‌లో మురళీ శర్మ చెబుతోంటే.. ఎమోషన్ గా ఫీలవుతాం. జీవితాన్ని పరిస్థితుల్ని, చేసే పనిని రెండో కోణంలో చూడమని చెప్పే సీన్ అది. ఇదే కాదు… క్యాబ్ డ్రైవర్ పాత్ర కూడా అంతే. అర్జున్ కి సెకండ్ ఛాన్స్ వచ్చాక.. మనుషులు కొత్తగా అర్థమవుతుంటారు. ఇలాంటి వేరేయేషన్స్ ఈ కథలో చాలా ఉన్నాయి.
సెకండాఫ్‌లో మీరాతో లవ్ ట్రాక్ మొదలవుతుంది. అయితే దాన్ని మరీ.. టూమచ్‌గా తీసుకెళ్లకుండా ఆ ట్రాక్ ని కూడా కథకు ఎంత కావాలో అంతే చూపించాడు. కేరళ ట్రిప్… అక్కడ జరిగే సన్నివేశాలు కాస్త బోర్ కొట్టిస్తాయి. కాకపోతే.. ఇలాంటి కథలకు సెకండాఫ్ సిండ్రోమ్ ఎక్కువే ఉంటుంది. సున్నితమైన కథలు, చిన్న పాయింట్లూ.. సెకండాఫ్‌లో తేలిపోతాయి. ఆ సమస్య `ఓరి దేవుడా`లో అంతగా కనిపించదు. అక్కడక్కడ కామెడీ, ఎమోషన్, లవ్.. ఫీల్ గుడ్ మూమెంట్స్ కొంచెం కొంచెం పంచుకొంటూ పోవడం, మధ్యమధ్యలో వెంకటేష్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ బాగా హెల్ప్ అయ్యాయి. పతాక సన్నివేశాలు ఊహకు అందనంత గొప్పగా ఏం సాగవు. కాకపోతే… వాటినీ ఆకట్టుకొనేలానే తీర్చిదిద్దాడు దర్శకుడు.
విశ్వక్ సేన్ నటన, తన స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్ అన్నీ బాగున్నాయి. చాలా చోట్ల కళ్లతోనే నటించాడు. ఓవర్ ది బోర్డ్ కి వెళ్లి నటించడం విశ్వక్‌కి అలవాటు. కానీ అర్జున్ మాత్రం ఆ గీత దాటలేదు. విశ్వక్‌ని ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. అందుకే ఎన్టీఆర్ రిఫరెన్సులు ఈ సినిమాలో కొన్ని కనిపిస్తాయి. కథానాయికలిద్దరూ ఆకట్టుకొన్నారు. పాత్ర మేరకు నటించారు. మిథిలాని చూస్తే కలర్స్ స్వాతి గుర్తొస్తుంది. వెంకటేష్ పాత్ర హుందాగా ఉంది. దేవుడంటే కిరీటాలూ, గదలూ లేకుండా.. స్టైలీష్‌గా నూ కనిపించొచ్చని వెంకీ నిరూపించాడు. తనది అతిథి పాత్రే అయినా… బలంగా గుర్తుండిపోతుంది.
ఈ సినిమా గొప్పతనమంతా స్క్రిప్టులోని, తన పాత్రలకు తగిన నటీనటుల్ని ఎంచుకోవడంలోనూ దాగి ఉంది. అశ్వత్ తమిళంలో ఎంత సమర్థవంతంగా ఆ పని చేశాడో.. తెలుగులోనూ అంతే ప్రభావవంతంగా పూర్తి చేశాడు. తమిళంలో పోలిస్తే భారీ మార్పులేం కనిపించలేదు. ఇలాంటి కథలకు నేటివిటీ సమస్యలు ఉండవు కూడా. మాటలు, పాటలు కథలో కలిసిపోయాయి. సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది.
ఓ మామూలు లవ్ స్టోరీకి ఫాంటసీ జోడించిన విధానం `ఓరి దేవుడా`లో ఆకట్టుకొంటుంది. యూత్ ఫుల్ సినిమా కాబట్టి.. వాళ్లకు నచ్చేలా తీశారు కాబట్టి.. బాక్సాఫీసు దగ్గర కూడా ఈ సినిమాకి ఢోకా లేకపోవొచ్చు. రీమేకులు సేఫ్ బెట్ అని చాలామంది చెబుతుంటారు. అలాంటి మరో సేఫ్ బెట్ ఈ సినిమా. నిర్మాతలకే కాదు…టికెట్ కొనే ప్రేక్షకులకు కూడా.
తెలుగు360 రేటింగ్: 2.75/5