ఆంధ్ర ప్రదేశ్ లో ఎండలు మండుతున్నాయి. కాబట్టి ప్రజలకు ఒఆర్ఎస్ ద్రావణంతో పాటు మజ్జిగను ఉచితంగా పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల స్పందన ఎలా ఉందోగానీ ప్రతిపక్షం మాత్రం హాట్ హాట్ గా ఫైరయింది. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీ విక్రయాలు పెంచుకోవడానికే మజ్జిగ ప్యాకేజీ ప్రకటించారని వైఎస్ జగన్ వీర విధేయుడు అంబటి రాంబాబు ఆరోపిచారు.
హెరిటేజ్ కంపెనీనుంచే కొనాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు రాంబాబుకు తెలిసిందేమో గానీ జనానికి తెలియదు. అసలు మజ్జిగ సరఫరా ఎలా జరుగుతోందో గమనించిన తర్వాత ఆరోపణాస్త్రాన్ని బయటకు తీయాల్సింది. పెరుగును కొని మజ్జిగ చేసి సరఫరా చేస్తుంటే అదొక పద్ధతి. అందుబాటులో ఉన్న కంపెనీ సరుకును కొని పంపిణీ చేయడం ఒక పద్ధతి. కంపెనీ ఏదైనా అడ్డగోలు ధరకు కాకుండా సరసమైన ధరకు కొని ప్రజలకు ఎండ వేడి నుంచి ఉశమనం కలిగించడానికి ప్రయత్నిస్తే తప్పా ఒప్పా అనేది జగన్ బృందం స్పష్టంగా చెప్పాలి.
ఆవిర్భవించి ఇంతకాలమైనా వైసీపీ ఇంకా రాజకీయ పార్టీ లక్షణాలను అలవరచుకోలేదు. ప్రతిపక్షమంటే ప్రభుత్వాన్ని తిట్టడం మామూలే. అయితే రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన విషయాల్లో మంచిని మంచిగా చెడును చెడుగా చూసి స్పందిస్తే జనం హర్షిస్తారు. రాష్ట్రం ఏదైనా విషయంలో మంచి స్థానంలో ఉందని తెలిస్తే సంతోషం వ్యక్తం చేయాలి. ప్రభుత్వాన్ని కాకపోయినా ప్రజలను అభినందించాలి. వైసీపీ ఆ పని కూడా చేయడం లేదు.
ఒకప్పుడు ఎండాకాలం వచ్చిందంటే వివిధ రాజకీయ పార్టీలు పోటాపోటీగా చలివేంద్రాలు ఏర్పాటు చేసేవి. ఓట్ల కోణంలోనే ఆ పని చేసినా, ప్రజలకు ఉశమనం లభించేది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రధాన కూడళ్లలో పందిళ్ల కింద చల్లటి నీటిని పంపిణీ చేసేవారు. దీని వల్ల ఎండలో ప్రయాణం చేసే వారికి ఊరట లభించేది. అధికార పార్టీ కంటే ప్రతిపక్షాలే ఈ విషయంలో ఎక్కువ చొరవ చూపేవి. రాను రానూ ఆ ఆనవాయితీ కనుమరుగై పోయింది. కడుపులో చల్ల కదలకుండా రాజకీయం చేయడం బాగా అలవాటైంది. ప్రతిపక్ష పార్టీగా వైసీపీ అయినా వేసవిలో చలివేంద్రాలు పెట్టి మంచినీళ్లనో మజ్జిగనో సరఫరా చేయడానికి సంకల్పించలేదు.
అధికార పార్టీ చేయని పన తాము చేశామని చెప్పుకోవడానికైనా ఈ సేవా కార్యక్రమాన్ని తలపెట్టలేదు. ఆ పార్టీ ఆవిర్భవించిన తర్వాత విమర్శలు ఓదార్పు యాత్రలే తప్ప సామాజిక సేవాభావంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు. ఎంతసేపూ ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. విలేకర్లను పిలిచి కాసేపు ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఆరోజుకు ప్రతిపక్ష పాత్ర అయిపోయిందన్న తరహా రాకీయాలే కనిపిస్తున్నాయి.
అధికార పార్టీ కూడా మానవతాదృక్పథంతో చలివేంద్రాలు, మజ్జిక కేంద్రాల ఏర్పాటును పట్టించుకోవడం లేదు. కనీసం హెరిటేజ్ సరుకుతో ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ప్రయత్నించడం లేదు. అయితే, ప్రతిపక్షంగా అధికార పార్టీపై విరుచుకు పడాలంటే తాను ప్రజల పక్షమని సంకేతాలివ్వాలి. కష్టకాలంలో ప్రజల వెంటే ఉంటామని భరోసా ఇవ్వాలి. దీన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపాలి. ఈ దిశగా వైసీపీ పెద్ద ఎత్తున, ఉద్యమ స్థాయిలో స్పందిస్తే ప్రజలు హర్షిస్తారు. ఆ పార్టీని అభినందిస్తారు. కడుపులో చల్ల కదలకుండా విమర్శల రాజకీయాలతో అధికారంలోకి రావాలంటే అయ్యే పనేనా అనేది ఆ పార్టీ వాళ్లు ఆలోచించాలి.