ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టిని ఆకర్షించారు యువ ఐఏఎస్ అధికారి కృష్ణతేజ. ఐఏఎస్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సామాజిక , సేవా దృక్పథంతో పని చేస్తుండటాన్ని గుర్తించిన పవన్ కళ్యాణ్.. కృష్ణతేజను ఏరికోరి మరీ ఓఎస్డీగా ఎంపిక చేసుకున్నారు. మార్పు తీసుకోచ్చేందుకు పాలకులు మాత్రమే కాదు..అధికారులు కూడా నిబద్దులై ఉండాలనుకుంటున్నా పవన్.. కీలకమైన గ్రామీణాభివృద్ధి శాఖను నిర్వర్తిస్తుండటంతో ఇన్స్పైరింగ్ అధికారి కృష్ణతేజను ఓఎస్డీగా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా మంత్రులకు ఆర్డీవో స్థాయి అధికారులను మాత్రమే ఓఎస్డీలుగా నియమిస్తారు. కానీ పవన్ మాత్రం తనకు ఓఎస్డీగా కృష్ణతేజను ఎంపిక చేయాలని చంద్రబాబును రిక్వెస్ట్ చేయడంతో ఆయన కాదనలేకపోయారు. పవన్ అడిగిందే తడవుగా ప్రస్తుతం కేరళలో పని చేస్తోన్న కృష్ణతేజను డిప్యూటేషన్ పై ఏపీకి పంపాలంటూ కేంద్రానికి లేఖ రాశారు చంద్రబాబు.
2015బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన కృష్ణతేజ ఏపీకి చెందినవారే కావడం విశేషం 2023 మార్చిలోనే కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఆయన అలప్పుజా, త్రిసూర్ కలెక్టర్ గా వ్యవహరించారు. అలెప్పీ సబ్ కలెక్టర్ గా కృష్ణతేజ వ్యవహరించిన సమయంలో కేరళను అతి భయంకరమైన వరదలు ముంచెత్తగా ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చొరవ తీసుకున్నారు. దగ్గరుండి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన కృష్ణతేజను దేశవ్యాప్తంగానే కాకుండా యూఎన్ఓ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా అభినందించాయి.
అంతేకాదు..వరదల ధాటికి సర్వం కోల్పోయిన నిర్వాసితులకు పూర్తి భరోసా కల్పించేందుకు ఐయామ్ ఫర్ అలెప్పీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విరాళాలు సేకరించి నిరాశ్రయుల జీవితంలో కొత్త వెలుగులు తీసుకొచ్చారు. త్రిసూర్ కలెక్టర్ గా కృష్ణతేజ అందించిన సేవలకు గాను ఆయన జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి ఎంపికయ్యారు. బాలల హక్కుల రక్షణలో త్రిసూర్ ను ప్రథమస్థానంలో నిలబెట్టడంతో ఆయనకు ఈ పురస్కారం అందుకున్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 609మంది విద్యార్థులను గుర్తించి వారి ఉన్నత చదువులకు చేయూత అందించారు.
పల్నాడు జిల్లాకు చెందిన ఈ యువ ఐఏఎస్ అధికారి ప్రొఫైల్ ను పరిశీలించి స్ఫూర్తిదాయకంగా ఉండటంతోనే కృష్ణతేజను ఓఎస్డీగా పవన్ ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.